భారీ వరదలు: సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

15 Oct, 2020 19:02 IST|Sakshi

సాయం చేయండి : ‍ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌ : గతవారం రోజులుగా తెలంగాణ ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు, వరదలతో మృతిచెందిన 50 మంది కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 101 చెరువుల కట్టలు తెగాయని, 7.35 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగాయని తెలిపారు. వరదల కారణాంగా సంభవించిన పంట నష్టం 2 వేల కోట్లు ఉంటుందని సీఎం కేసీఆర్‌ అంచనా వేశారు. ఈ మేరకు భారీవర్షాలు, వరదలపై గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష చేపట్టారు. (భారీ వరద: ఏ క్షణామైనా తెగిపోయే ప్రమాదం)

సమీక్ష సందర్భంగా అధికారులతో కేసీఆర్‌ మాట్లాడుతూ..‘1916 తర్వాత ఒకేరోజు హైదరాబాద్‌లో 31 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీనివల్ల చాలా ప్రాంతాలు జలమయ్యాయి. ఎఫ్‌పీఎల్ పరిధిలో ఉన్న కాలనీల్లో పెద్దఎత్తున నీరు చేరింది. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 11 మంది మృతిచెందారు. అపార్ట్‌మెంట్ల సెల్లార్‌లో కూడా నీరు చేరడంతో ప్రజలకు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లోని 72 ప్రాంతాల్లో 144 కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి. 35 వేల కుటుంబాలు వరద ముంపునకు గురయ్యాయి. (మరో 3 రోజులపాటు తెలంగాణలో వర్షాలు)

ఎల్బీనగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో.. వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో 72 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతిరోజు లక్షా 10 వేల మందికి భోజన వసతి కల్పిస్తున్నాం. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించాం. ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు, ప్రతి ఇంటికి 3 రగ్గులు అందించాలి.

సహాయక కార్యక్రమాల కోసం జీహెచ్‌ఎంసీకి రూ.5 కోట్లు విడుదల చేశాం. ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇల్లు మంజూరు చేస్తాం. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ఆర్థిక సహాయం అందిస్తాం. సెల్లార్లలో నీటిని తొలగించిన తర్వాతే అపార్ట్‌మెంట్లకు విద్యుత్ సరఫరా ఇవ్వాలి. ఒకట్రెండు రోజులు ఇబ్బంది కలిగినా ప్రాణనష్టం ఉండకూడదు. విద్యుత్ అధికారులకు ప్రజలు కూడా సహకరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చాం’ అని పేర్కొన్నారు. కాగా తక్షణ సహాయం, పునరావాస చర్యల కోసం.. రూ.1350 కోట్లు సహాయాన్ని అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేసీఆర్‌ రాశారు. 

మరిన్ని వార్తలు