కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ బదిలీ

1 Feb, 2023 09:54 IST|Sakshi

సిక్తా పట్నాయక్‌.. రెండున్నరేళ్లు
ఆదిలాబాద్‌: పెద్దపల్లి కలెక్టర్‌గా పనిచేస్తూ 2020 జూలై 17న ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్‌ శ్రీదేవసేన నుంచి బాధ్యతలు స్వీకరించారు. రెండు సంవత్సరాల ఆరు నెలల పాటు కలెక్టర్‌గా సేవలందించిన ఆమె ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు తొలి ప్రాధాన్యతనిచ్చారు. కోవిడ్‌ రెండో దశ తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో జిల్లాలో వైరస్‌ కట్టడికి ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వైరస్‌ కారణంగా పాలనకు ఇ బ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆఫీస్‌ అమలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితబంధు అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఎక్కుమంది ఎస్సీలకు భూ పంపిణీ చేపట్టి జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపారు. 

ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాను ముందుంచేలా అధికా రులకు మార్గనిర్దేశం చేస్తూ వాటి ఫలితాలను రాబట్టేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. క్షేత్రస్థాయి పర్యటనలు సైతం చేపట్టి వారిని ప్రోత్సహించారు. ముఖ్యంగా 2021లో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట లు, ఆదివాసీగూడేలు, తండాలను కాలినడకన వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లి పరిశీలించారు. వారితో మమేకమై సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారికి అండగా నిలిచా రు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలను అందించారు. ప్రజాప్రతినిధులు, అధికారులనే తారతమ్యం లే కుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములను చేసి విజయవంతం చేశారు. వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించి రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. 

కొత్త కలెక్టర్‌గా రాహుల్‌రాజ్‌
ఆదిలాబాద్‌ జిల్లా కొత్త కలెక్టర్‌గా రాహుల్‌రాజ్‌ నియామకమయ్యారు. ప్రస్తుత కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ హనుమకొండ కలెక్టర్‌గా బదిలీపై వెళ్లనున్నారు. అలాగే ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డిని నిర్మల్‌ కలెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాహుల్‌రాజ్‌ జిల్లా కలెక్టర్‌గా రానున్నట్లు కొద్ది రోజులుగా ఇక్కడి ప్రజల్లో జరుగుతున్న చర్చ నిజమైంది. 

 కుమురంభీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న రాహుల్‌రాజ్‌ను ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా నియమించారు. గతేడాది కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ప్రసూతి సెలవులకు వెళ్లిన సందర్భంలో ఈయన నెల పాటు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా పనిచేశారు. ఆయనే జిల్లా కలెక్టర్‌గా రానుండటంతో తన పనితీరుతో ఎలాంటి ముద్ర వేస్తారనే చర్చ సాగుతోంది. ఆయన గురువారం జిల్లాలో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లుగా అధికారిక వర్గాల సమాచారం.

మరిన్ని వార్తలు