దుస్తుల్లో జెర్రులు.. బాత్రూముల్లో తేళ్లు

15 Nov, 2021 01:07 IST|Sakshi
పాఠశాల గేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు 

ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు

మహాత్మాజ్యోతిరావు పూలే పాఠశాలలో బాలికల అవస్థలు

గుండ్లపల్లిలో రోడ్డెక్కిన విద్యార్థులు, తల్లిదండ్రులు 

గన్నేరువరం(మానకొండూర్‌): ‘వేసుకునే దుస్తుల్లో జెర్రులు పారుతున్నాయి.. స్నానానికి బాత్రూముకెళితే తేళ్లు తిరుగుతున్నాయి.. అందరం ఆడపిల్లలం.. రాత్రిపూట బయటికి రావాలంటేనే భయమేస్తోంది.. గతేడాదే సమస్యను పాఠశాల అధికారులకు వివరించాం.. అయినా ఇప్పటికీ తీరుమారలేదు’ కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలోని మహాత్మాజ్యోతిరావు పూలే బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆదివారం ఆందోళనకు దిగారు.

రాజీవ్‌ రహదారిపై ధర్నా నిర్వహించారు. గుండ్లపల్లిలోని రాజీవ్‌ రహ దారి సమీపంలో అద్దె భవనంలో ఈ పాఠశాలను నిర్వహిస్తున్నారు. 2019లో 240 మంది విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం 400 మంది చదువుతున్నా రు. గతంలో 5 నుంచి 7వ తరగతులు ఉండేవి. ఇప్పుడు 9వ తరగతి వరకు 10 సెక్షన్లుగా తరగతు లు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు లేవని.. పాఠశాలలో రెండో ఆదివారం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

పాఠశాల అధికారులు, భవన యజమాని పట్టించుకోవడం లేదని రాజీవ్‌రహదారిపై ఆందోళ నకు దిగారు.  తిమ్మాపూర్‌ సర్కిల్‌ సీఐ శశిధర్‌రెడ్డి గుండ్లపల్లికి చేరుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించేలా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా.. గదుల, తదితర నిర్మాణాలు పనులు జరుగుతున్నాయని భవన యాజమాని తెలిపారు. 

మరిన్ని వార్తలు