6 గ్యారంటీలకు తెల్ల కార్డే కీలకం

25 Dec, 2023 02:21 IST|Sakshi

 త్వరలో ధరణి ప్రక్షాళన... 

కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు 

మీడియా సమావేశంలో వెల్లడించిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీల కింద లబ్ధి దారుల ఎంపికకు అర్హతగా తెల్లరేషన్‌కార్డును ప్రామాణికం(థంబ్‌రూల్‌)గా పెట్టుకుంది.  ‘ప్రజాపాలన’పేరుతో కార్యక్రమం నిర్వహించి ప్రజల గుమ్మం దగ్గరే గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహచర కేబినెట్‌ మంత్రులతో కలిసి ఆదివారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సచివాలయ మీడియా సెంటర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలు  వెల్లడించారు.

గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను 28వ తేదీకి ముందే స్థానిక అధికారులు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. తక్కువ సమయం ఉందని, రద్దీ ఎక్కువగా ఉందని, దరఖాస్తు ఇవ్వలేదని ఆందోళన అక్కర్లేదన్నారు. అందరి దరఖాస్తులను ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకుంటుందని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు.   

వన్‌సైడ్‌ బ్యాటింగ్‌ చేయం.. సలహాలు స్వేచ్ఛగా ఇవ్వండి 
ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో అన్న అంశంపై వారి ఆలోచనలు, అభిప్రాయాలను సీఎం రేవంత్‌ రెడ్డి తెలుసుకున్నారని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం తరహాలో వన్‌సైడ్‌ బ్యాటింగ్‌ చేయమని, ఏదైనా ఇబ్బందులు, సలహాలుంటే స్వేచ్ఛగా తెలియజేయాలని కలెక్టర్లు, ఎస్పీలను కోరినట్టు చెప్పారు.

]అధికారులు కూడా మంచి సలహాలు ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవులు ఐపీఎస్‌. ఐఏఎస్‌ అధికారులే అని స్పష్టం చేశామన్నారు. విద్య వైద్యం, ఇతర రంగాల్లో ప్రభుత్వ ఆలోచనలను, విధానాలను వారికి వివరించామన్నారు. చాలా సౌకర్యవంతంగా అధికారులు ఫీల్‌ అయ్యారని, ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అర్థం చేసుకున్నారన్నారు. వ్యక్తులు, వ్యవస్థల పట్ల కక్షపూరితంగా వ్యవహరించమని, తప్పు చేస్తే ఎంత పెద్ద వారినైనా ఊపేక్షించేది ఉండదని స్పష్టం చేశారు. 

గత ప్రభుత్వం కబ్జా చేసిన భూములను ప్రజలకు పంచిపెడతాం 
ధరణి పోర్టల్‌ను అడ్డంపెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు, తొత్తులు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, ఇంకా కొన్ని భూములకు సంబంధించిన ఫైల్స్‌ సర్క్యులేషన్‌లో ఉన్నాయని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ధరణిలో ఒకటే కాలమ్‌ ఇచ్చారని, ఒక సారి కలెక్టర్‌/ సీసీఎల్‌ఏ లాగిన్‌ అయితే పోర్టల్‌లో ఐటం కనబడదన్నారు.

’’ధరణి పోర్టల్‌ ప్రక్షాళన చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించడంతో పాటు గత ప్రభుత్వం కబ్జా చేసిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచిపెడ్తాం. ధరణిలో తప్పులను సరిదిద్ది సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ఆరు గ్యారంటీలతో పాటు ధరణిపై కసరత్తు ప్రారంభించాం.. స్పష్టత వచ్చాక ప్రక్షాళన చేస్తాం. అన్ని ఆధారాలతో ఒక రోజు ధరణిపై మీడియా ముందుకు వస్తాం’’అని పొంగులేటి ప్రకటించారు.   
 

>
మరిన్ని వార్తలు