ఏయూలో చారిత్రక కళావేదిక పునఃప్రారంభం 

25 Nov, 2023 03:37 IST|Sakshi

సంతోషం వ్యక్తం చేసిన సినీ నటుడు అక్కినేని నాగార్జున 

ఎందరో కళాకారులకు ప్రాణం పోసిన వేదిక మళ్లీ అందుబాటులోకి తేవడంపై హర్షం

ఏయూలో తన సినిమా చిత్రీకరిస్తానని వెల్లడి  

ఏయూ క్యాంపస్‌ (విశాఖ తూర్పు): ఆంధ్ర యూనివర్సిటీలో అభివృద్ధి చేసిన చారిత్రక ఆరుబయలు రంగస్థల వేదిక–ఎస్కిన్‌ స్క్వేర్‌ను ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున చేతుల మీదుగా శుక్రవారం పునఃప్రారంభించారు. దాదాపు రూ.కోటి వ్యయంతో నాడు–నేడు పథకం స్ఫూర్తితో ఆధునీకరించిన యాంఫీ థియేటర్‌ను నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ఏయూ ప్రాంగణంలో తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నటించిన కులగోత్రాలు చిత్రం షూటింగ్‌ జరిగిందన్నారు.

త్వరలో తన సినిమా షూటింగ్‌ను కూడా ఇదే ప్రాంగణంలో చేస్తానని చెప్పారు. ఎందరో కళాకారులకు ప్రాణం పోసిన ఏయూ రంగస్థల వేదికను మళ్లీ తన చేతుల మీదుగా పునఃప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కళావేదిక చరిత్ర వింటుంటే అల్లూరి సీతారామరాజు గుర్తుకు వచ్చారన్నారు. తనపై ఎనలేని ప్రేమాభిమానాలు చూపించిన ఏయూ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏయూ హిందీ విభాగం గౌరవ ఆచార్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు సంస్కారం కలిగిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆ రోజుల్లో సొంత ఇంటిని కొనుక్కోకుండా తన సంపాదనలో లక్ష రూపాయలు గుడివాడ కాలేజీకి, రూ.25 వేలు ఏయూకు విరాళంగా అందించారని గుర్తు చేశారు. ఈరోజు ఆయన వారసులు ఏయూ రంగస్థల వేదికను పునఃప్రారంభించడం సంతోషించదగ్గ విషయమన్నారు. 

ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ సూచించిన విధంగా ఆర్ట్స్‌ కోర్సులకు పూర్వవైభవం తీసుకువస్తున్నామన్నారు. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నటన తదితరాలను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన నాడు–నేడు పథకం నిధులతో విశ్వవిద్యాలయంలో చేసిన అభివృద్ధిని వివరించారు. రెండున్నర దశాబ్దాలుగా నిరుపయోగంగా మారిన ఈ ప్రాంగణాన్ని సీఎం జగన్‌ సహకారంతో సుందరంగా తీర్చిదిద్దామన్నారు.

దీనిని నామమాత్రపు అద్దెతో కళాకారులకు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు అక్కినేని అఖిల్, నాగార్జున సోదరి సుశీల, ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజి్రస్టార్‌ ఆచార్య ఎం.జేమ్స్‌ స్టీఫెన్, ప్రిన్సిపాల్స్, డీన్‌లు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నేపథ్య గాయకుడు ధనుంజయ్‌ ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి.  

మరిన్ని వార్తలు