జిల్లా ఆస్పత్రికి వెళ్లినా అంతే.. 

28 Jan, 2022 04:34 IST|Sakshi
పీపీఈ కిట్‌ ధరించి అంబులెన్స్‌లో  ఆసుపత్రికి వెళ్తున్న గర్భిణి

పాజిటివ్‌ గర్భిణి మహబూబ్‌నగర్‌కు తరలింపు

హైరిస్కు కేసు: ఆస్పత్రి సూపరింటెండెంట్‌

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లా ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి వైద్యులు రిఫర్‌ చేసిన సంఘటన నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం బాలన్‌పల్లికి చెందిన గర్భిణికి కాళ్లు, ఒంటినొప్పులు ఎక్కువగా ఉండటంతో గురువారం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలడంతో మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు.

దీంతో గర్భిణికి పీపీఈ కిట్‌ వేసి అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. పాజిటివ్‌ వచ్చిన గర్భిణులకు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలతో సహా ఎక్కడికక్కడే కాన్పులు నిర్వహించాలనే ఆదేశాలున్నాయి. ఈనెల 25న అచ్చంపేట ఆస్పత్రిలో ఘటన నేపథ్యంలో.. జిల్లా ఆస్పత్రి నుంచి గర్భిణి తరలింపు విమర్శలకు తావిస్తోంది. దీనిపై జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివరాం వివరణ కోరగా.. ఆస్పత్రి వచ్చిన గర్భిణికి కరోనా పాజిటివ్‌తో పాటు రక్తం తక్కువగా ఉండటంతో హైరిస్కు కేసుగా భావించి మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేశామన్నారు. అంబులెన్స్‌ ఏర్పాటు చేసి సురక్షితంగా తరలించామని చెప్పారు.

మరిన్ని వార్తలు