కన్నీళ్లకే కన్నీళ్లొచ్చె: సోదరి మృతదేహాన్ని నడుముకు కట్టుకుని..

8 Nov, 2023 11:53 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లో హృదయాలను కలచివేసే ఉదంతం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఔరయ్య జిల్లాలో ఆరోగ్య సేవల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందనేది మరోమారు వెల్లడయ్యింది. నవీన్ బస్తీ వెస్ట్‌లో నివాసం ఉంటున్న ప్రబల్ ప్రతాప్ సింగ్ కుమార్తె అంజలి (20) పొరపాటున వేడి నీటితో నిండిన బకెట్‌లోని వాటర్‌ హీటర్‌ను ముట్టుకుని విద్యుదాఘానికి గురై, అపస్మారక స్థితికి చేరుకుంది.

ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే  సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు అంజలి చనిపోయిందని నిర్ధారించారు. అంజలి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అందుబాటులో ఎలాంటి వాహనం లేదు. దీంతో మృతురాలి సోదరుడు సాహసం చేశాడు. ఆ మృతదేహాన్ని బైక్‌పై ఉంచి, దానిని చున్నీతో తన నడుముకు కట్టుకుని, వెనుకగా మరో సోదరిని కూర్చోబెట్టుకుని బైక్‌ను ఇంటివైపు నడిపాడు. 

ఇందుకు 15 నిముషాల సమయం పట్టింది. దీనిని గమనించి కూడా ఆసుపత్రి సిబ్బంది తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించారు. ఈ ఉదంతం గురించి సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వాహనం కావాలని తమను అడిగితే, ఏర్పాటు చేసేవారమని తెలిపారు. కాగా జిల్లాలో రెండు అంబులెన్సులు మాత్రమే ఉన్నాయి. అవి ఔరయ్య ‍ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునేందుకు రెండున్నర గంటలు పడుతుందని స్థానికులు చెబుతున్నారు. 
ఇది కూడా చదవండి: హిమాలయాలు క్యాన్సిల్‌.. ప్రచారం షురూ: ఉమాభారతి యూటర్న్‌!

మరిన్ని వార్తలు