25 లక్షలు దాటిన కరోనా పరీక్షలు 

22 Sep, 2020 04:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలసంఖ్య భారీగా పెరిగింది. నెలరోజుల్లోనే పరీక్షలు దాదాపు మూడింతలయ్యాయి. గత నెల 20వ తేదీ నాటికి రాష్ట్రం లో 8,48,078 పరీక్షలు నిర్వహించగా, ఈ నెల 20 నాటికి వాటి సంఖ్య 25,19,315కు చేరుకున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ సోమవా రం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది.  కరోనా కేసుల సంఖ్య 1,72,608కి చేరింది. మొత్తంగా 6.85 శాతం మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది.  1,41,930 మంది కోలుకున్నారు. కోలుకున్నవారి రేటు 82.22 శాతా నికి పెరగడం గమనార్హం. నెల క్రితం రాష్ట్రం లో కోలుకున్నవారి రేటు 77.43 శాతం మాత్ర మే ఉంది. నెలక్రితం కరోనా మరణాల రేటు 0.74 శాతం ఉంటే, ఇప్పుడు 0.60 శాతానికి తగ్గింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 29,636 ఉండగా, అందులో 22,990 మంది ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రతి 10 లక్షల జనాభాలో 67,858 మందికి కరోనా పరీక్షలు చేశారు.  

ఒక్క రోజులో 31,095 పరీక్షలు... 
ఆదివారం ఒక్కరోజు 31,095 పరీక్షలు నిర్వహించగా, అందులో 1,302 మందికి కరోనా సోకినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు బులెటిన్‌లో వెల్లడించారు. ఒక్కరోజులో 2,230 మంది కోలుకోగా, 9 మంది మరణించారు. 45 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8,093 కరోనా పడకలుండగా, వాటి ల్లో 2,584 పడకలు మాత్రమే రోగులతో నిండిపోయాయి. 223 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 11,055 పడకలుండగా, 4,062 నిండిపోగా  6,993 పడకలు ఖాళీగా ఉన్నాయన్నారు.  

టెస్టులు చేయకపోవడంపై...
ఈ నెల 20న జయశంకర్‌ భూపాలపల్లి, మేడ్చల్‌ జిల్లాల్లో ఒక్క పరీక్ష కూడా చేయలేదు. నారాయణపేట జిల్లాలో 8, నిర్మల్‌ జిల్లాలో 47, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 39, వికారాబాద్‌ జిల్లాలో కేవలం 72 పరీక్షలు మాత్రమే చేశారని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోమవారం ఆ జిల్లా వైద్యాధికారుల (డీఎంహెచ్‌ఓ)కు నోటీసులు జారీ చేశారు.  24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా