సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ, తమ్మినేని డిమాండ్‌

26 Jan, 2021 17:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్‌ రెడ్డి, తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. రైతులకు మద్దతుగా మంగళవారం వారు చేపట్టిన ర్యాలీ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు నిరసనలు కేవలం పంజాబ్ పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా రైతు సంఘాలకు మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఆహార భద్రతకు చిల్లు పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలను తీసుకొచ్చిందని వారు ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలను రాజ్యాంగ వ్యతిరేక చట్టాలుగా అభివర్ణించారు. దేశంలో ప్రశ్నించే గొంతుకలను మోదీ సర్కారు జైల్లో పెడుతుందని, అలా చేసిన వరవరరావు సహా పదహారు మందిని జైల్లో పెట్టడం దుర్మార్గ చర్య  వారు విమర్శించారు.

రైతులకు మద్దతుగా నిలవకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సైతం నిరసన‌ సెగలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. తొలుత వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్.. మూడు రోజుల్లోనే మాట మార్చారని, రైతుల పట్ల ముఖ్యమంత్రికి చిత్తశుద్ధే లేదని వారు ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ కేంద్ర పెద్దలకు వంగివంగి దండాలు పెట్టి వచ్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విపలమయ్యారని ఆరోపించారు. 

దేశప్రజలంతా ఏకమై తగిన శాస్తి చెబుతారు: ప్రొ. కోదండరామ్

వ్యవసాయం అంటే కంపెనీలు కాదు, వ్యవసాయం అంటే రైతులు మాత్రమే.. అలాంటిది రైతు ప్రయోజనాలు పక్కన పెట్టి, కార్పొరేట్‌ శక్తులకు లబ్ధి చేకూర్చాలని మోదీ సర్కారు భావిస్తే, దేశప్రజలంతా ఏకమై తగిన శాస్తి చెబుతారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ హెచ్చరించారు. చట్టాలను సామాన్య ప్రజల లబ్ధి కోసం రూపొందించాలి కానీ, కార్పొరేట్ శక్తుల కడుపు నింపడం కోసం కాదని ఆయన విమర్శించారు. సమాజంలో ఆత్మగౌరవంతో బతికేలా చూడాలని మాత్రమే రైతులు కోరుతున్నారని, అంతకు మించి వారు ఏదీ ఆశించడం లేదన్నారు. రైతు పోరాటం ఢిల్లీలోనే కాదు గల్లీలోనూ కొనసాగుతుందని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాడు.

మరిన్ని వార్తలు