ఫిలింసిటీ గోడలు బద్దలు కొడతాం.. రామోజీరావు భూకబ్జాకోరు, అరెస్టు చేసి జైల్లో పెట్టాలి 

29 Nov, 2022 08:30 IST|Sakshi
పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట

ప్లాట్లు స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతాం 

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య డిమాండ్‌  

రంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా.. ఉద్రిక్తత 

ఇబ్రహీంపట్నం రూరల్‌: ప్రభుత్వ భూములను కబ్జా చేసి రామోజీరావు ఫిలింసిటీని నిర్మించారని.. ప్రభుత్వం దీనిపై కేసులు నమోదు చేసి, రామోజీని అరెస్టు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఫిలింసిటీ గోడలు బద్దలుకొట్టి ప్లాట్లు స్వాధీనం చేసుకుని, పేదలకు పంచుతామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి సర్వే నంబర్‌ 189, 203లలో 675 మందికి ఇళ్లస్థలాలు కేటాయించాలని, డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడారు. ‘‘రామోజీరావు భూకబ్జాకోరు. పేదల పాలిట రాక్షసుడు. తమకు కేటాయించిన స్థలాల్లోకి పేదలను రాకుండా రామోజీ అడ్డుకోవడం సరికాదు. పేదలు పోరాటాలు చేసి గుడిసెలు వేసుకుంటే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు కేసు పెట్టాల్సింది రామోజీపై. రామోజీ లాంటి పెట్టుబడిదారులు భూములు ఆక్రమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం ఏమిటి?’’అని ప్రశ్నించారు.

అధికారంలోకి రాక ముందు లక్ష నాగళ్లతో ఫిలింసిటీని దున్నిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు మౌనం వహిస్తున్నారేమని విమర్శించారు. తెలంగాణలో భూదాన్, సీలింగ్, సర్కార్, పొరంబోకు భూములు పదిన్నర లక్షల ఎకరాలు ఉన్నాయని.. తమ ప్రాణాలు పణంగా పెట్టి అయినా పేదలకు స్థలాలు ఇప్పించే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. 

రామోజీ సొంత భూములేం అడగడం లేదు 
పేద ప్రజలు రామోజీ సొంత భూములేమీ అడగడం లేదని.. ఫిలింసిటీలోని 172 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వా లని కోరుతున్నామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరయ్య స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు, రియల్‌ ఎస్టేట్‌ దారుల కోసమే అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. ఇక రంగారెడ్డి జిల్లాలో ఐదున్నర లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి భాస్కర్‌ పేర్కొన్నారు. 

తోపులాట.. ఉద్రిక్తత.. 
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్‌ వైపు దూసుకొస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు తోపులాట జరిగింది. కాసేపటికి సీపీఎం నేతలను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. కార్యకర్తలను చెదరగొట్టారు.

తర్వాత 10మంది నేతలు, కార్యకర్తలు వెళ్లి అదనపు కలెక్టర్‌ తిరుపతిరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు డి.జగదీశ్, సామేలు, జిల్లా కమిటీ సభ్యుడు కందుకూరి జగన్, మండల కార్యదర్శి సీహెచ్‌ జంగయ్య తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు