రాష్ట్రానికి వర్షసూచన 

2 Dec, 2023 02:23 IST|Sakshi

నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు!.. 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గనున్న ఉష్ణోగ్రతలు 

బంగాళాఖాతంలో 3న తుపానుగా మారనున్న వాయుగుండం 

సాక్షి, హైదరాబాద్‌:  రానున్న రెండురోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ, పరిసర నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం క్రమంగా బలపడుతూ ఈనెల 2న తీవ్ర వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. ఆ తర్వాత వాయువ్య దిశగా కదిలి 3న నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా మారనున్నట్లు వివరించింది.

ఆ తర్వాత కూడా వాయవ్య దిశగానే ప్రయాణించి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలోని చెన్నై, మచిలీపట్నం మధ్య ఈనెల 4వ తేదీ సాయంత్రానికి తీరం దాటుతుందని తెలిపింది.

ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతుండగా, రానున్న మూడురోజుల్లో 2 డిగ్రీ సెల్సియస్‌ నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ మేర తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం ఖమ్మంలో 34.4 డిగ్రీ సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా మెదక్‌లో 17.4 డిగ్రీ సెల్సియస్‌ నమోదైంది.  

మరిన్ని వార్తలు