పేలుడు పదార్థాల సరఫరా కేసులో.. 8 మందిపై ఎన్‌ఐఏ చార్జిషీట్‌ 

2 Dec, 2023 03:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతాదళాలపై పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నిన ఎనిమిది మంది మావోయిస్టులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శుక్రవారం చార్జిషిట్‌ దాఖలు చేసింది. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యక్తులపై 2023 జూన్‌ 5న చెర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కేసు నమోదైంది.

ఈ కేసుతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులపై ఐపీసీ సెక్షన్‌ 120(బీ), 143, 147, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్‌ 10,13,18,20ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. పట్టుబడిన నిందితులు మావోయిస్టులకు కొరియర్లుగా పనిచేస్తున్నట్లు చార్జిషీట్‌లో తెలిపింది. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లేథ్‌ మెషీన్లు సరఫరా చేస్తుండగా పునెం నాగేశ్వరరావు, దేవనూరి మల్లికార్జున రావు, వొల్లిపోగుల ఉమాశంకర్‌ను అరెస్టు చేశారు.

ఆ తర్వాత వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు జన్ను కోటి, ఆరేపల్లి శ్రీకాంత్, తాళ్లపల్లి ఆరోగ్యం, బొంత మహేందర్, సోనబోయిన కుమారస్వామిని అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. పునెం నాగేశ్వరావు, దేవనూరి మల్లికార్జునరావు, వొల్లిపోగుల ఉమాశంకర్‌లు 2023 మార్చిలో డ్రిల్‌ మిషన్, మే 2023లో ఒక లేథ్‌ మిషన్‌ కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైనట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. ఈ ముగ్గురు నిందితులు మే లో డ్రోన్లు, పేలుడు పదార్థాలు గుర్తించినట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు