బజ్జీల కోసం సైరన్‌ మోగిస్తూ.. అంబులెన్స్‌ డ్రైవర్‌ అత్యుత్సాహం.. షాక్‌!

12 Jul, 2023 02:35 IST|Sakshi

అత్యవసరమని అంబులెన్సుకు దారిచ్చిన కానిస్టేబుల్‌ 

సిగ్నల్‌ దాటగానే మిర్చి బండి వద్ద ఆగిబజ్జీలు తిన్న డ్రైవర్‌ 

సైరన్‌ దుర్వినియోగంపై ట్విట్టర్‌లో డీజీపీ ఆగ్రహం 

డ్రైవర్‌ను తొలగించిన సెంచురీ ఆస్పత్రి యాజమాన్యం 

సాక్షి, హైదరాబాద్‌/హిమాయత్‌నగర్‌: కుయ్‌ కుయ్‌ కుయ్‌ మంటూ సైరన్‌ మోగిస్తూ వచ్చిన అంబులెన్స్‌ను చూసిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ హుటాహుటిన స్పందించారు. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసి వాహనానికి దారి ఇచ్చారు.. అంతే.. అంబులెన్స్‌ సిగ్నల్‌ దాటాక మిర్చిబజ్జీల దుకాణం ముందు ఆగింది. సెంచురీ ఆసుపత్రి అంబులెన్స్‌ డ్రైవర్‌ నిర్వాకమిది. నారాయణగూడ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన జరిగింది.

హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ మార్గంలో బంజారాహిల్స్‌ సెంచురీ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్‌ వస్తోంది. ఓల్డ్‌ సీపీ కార్యాలయం వద్దకు వచ్చేసరికి ట్రాఫిక్‌ కనిపించడంతో డ్రైవర్‌ సైరన్‌ మోగించాడు. దీంతో అక్కడున్న నారాయణగూడ ట్రాఫిక్‌ పోలీసు రషీద్‌ హుటాహుటిన ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. ట్రాఫిక్‌ నుంచి క్షణాల్లో బయటపడ్డ ఆ డ్రైవర్‌ కాస్త ముందుకెళ్లాక తాపీగా మిర్చి బజ్జీలు తినడం చూసిన కానిస్టేబుల్‌ బిత్తరపోయారు.

అంబులెన్స్‌లో రోగులు లేరని, ఆసుపత్రి సిబ్బంది మాత్రమే ఉన్నారని గ్రహించారు. ఈ ఉదంతం అంతా వీడియో తీసిన కానిస్టేబుల్‌ దాన్ని ఉన్నతాధికారులకు పంపించారు. ఈ వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసిన డీజీపీ అంజనీకుమార్‌.. అంబులెన్స్‌ సైరన్‌ల దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదంతంలో సదరు అంబులెన్స్‌ డ్రైవర్, ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పాటు.. ఇకపై ఇలాంటి దురి్వనియోగాలను సహించబోమని హెచ్చరించారు.

ఈ ట్వీట్‌ చూసిన తర్వాత నారాయణగూడ ట్రాఫిక్‌ పోలీసులు ఆ అంబులెన్స్‌కు రూ.1000 జరిమానా విధించారు. బుధవారం తనిఖీల కోసం ఆర్టీఏను పంపిస్తున్నట్లు తెలిసింది. డీజీపీ ట్వీట్‌పై  సెంచురీ ఆస్పత్రి యాజమాన్యం సైతం స్పందించింది, రోగులు లేకుండా అకారణంగా సైరన్‌ వేసిన డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు