అమ్మమ్మా.. హాస్పిటల్‌కు వచ్చేశాం... అంతలోనే!

12 May, 2021 13:24 IST|Sakshi
మీనాక్షి పల్స్‌ చెక్‌ చేస్తున్న సిబ్బంది

అమ్మమ్మను రక్షించుకోలేకపోయిన వైద్యురాలు

కింగ్‌కోఠిలో అడ్మిషన్‌ ఆలస్యం

ఎమర్జెన్సీ కేసు అంటూ.. ఉస్మానియాకు రెఫర్‌

అక్కడకు వెళ్లగానే మనవరాలి ఒడిలోనే తుదిశ్వాస

కన్నీటిపర్యంతమైన డాక్టర్‌ హిమజ

సాక్షి, హిమాయత్‌నగర్‌: ‘అమ్మమ్మా.. హాస్పిటల్‌కు వచ్చేశాం.. నీకేం కాదు. ఇక్కడ నీకు నేనే దగ్గరుండి వైద్యం చేపిస్తా. నా ఫ్రెండ్స్‌ కూడా ఇక్కడ డాక్టర్స్‌ ఉన్నారు. నువ్వు ధైర్యంగా ఉండు అమ్మమ్మా.. అంటూ తన ఒడిలో పడుకోబెట్టుకున్న అమ్మమ్మకు భరోసా ఇచ్చింది ఓ వైద్యురాలు.  

‘పై ఫొటోలో కనిపిస్తున్న వైద్యురాలి పేరు డాక్టర్‌ హిమజ. అమీర్‌పేటలోని నేచుర్‌క్యూర్‌ ఆస్పత్రిలో వైద్యురాలు. ఎందరో కోవిడ్‌ బాధితులను రక్షించింది. కూకట్‌పల్లిలో నివాసం ఉండే తన అమ్మమ్మ మీనాక్షి(62) తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో.. మంగళవారం ఉదయం 11.40గంటల సమయంలో కింగ్‌కోఠి ఆస్పత్రికి తానే ఆటోలో తీసుకొచ్చింది. అడ్మిషన్‌కు లోపల ఆలస్యం అవుతోంది.. బయటేమో మీనాక్షి పల్స్‌ రేటు పడిపోతోంది.

15 నిమిషాల తర్వాత బయటే ఉన్న ఆక్సిజన్‌ కాన్సండ్రేటర్‌ నుంచి మీనాక్షికి ఆక్సిజన్‌ పెట్టారు. డాక్టర్‌ హిమజ లోనికి వెళ్లి అడ్మిషన్‌కు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్‌ రూమ్‌ వద్ద చెప్పి స్లిప్‌ తీసుకున్నారు. అడ్మిషన్‌ ప్రక్రియ చేసే సిబ్బంది వద్దకు వచ్చి ఆ స్లిప్‌ను ఇచ్చారు. అప్పుడు సిబ్బంది వచ్చి ఆక్సిజన్‌ సాచురేషన్‌ లెవెల్స్‌ చూడగా.. 42కంటే తక్కువగా ఉన్నాయి. ఎమర్జెన్సీ కేసు కాబట్టి గాంధీ లేదా ఉస్మానియాకు వెళ్లండన్నారు. గాంధీలో బెడ్స్‌లేని కారణంగా ఉస్మానియాకు రాయించుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రి లోపలికి వెళ్లగానే డాక్టర్‌ హిమజ చేతిలోనే ఆమె తుదిశ్వాస విడిచింది.  


 ఆక్సిజన్‌ అందిస్తూ.. 

డాక్టర్‌ అయ్యుండి కూడా..  
నేను ఒక డాక్టర్‌ అయ్యుండి కూడా నాకెంతో ఇష్టమైన అమ్మమ్మను రక్షించుకోలేకపోయాను అంటూ కన్నీటిపర్యంతమైయ్యింది డాక్టర్‌ హిమజ. అమ్మమ్మ బతుకుతుందనే ధైర్యంతో ఇంటిల్లిపాదికి ధైర్యాన్ని నూరిపోశాను. ఓ పక్క అడ్మిషన్‌కు ఆలస్యం.. మరో పక్క ఆక్సిజన్‌ సాచురేషన్‌ లెవెల్స్‌ తగ్గిపోవడంతో.. నా చేతిలోనే చనిపోయిందంటూ ‘సాక్షి’తో బోరున విలపించింది. 

చదవండి: Lockdown: సిటీలో ‘పరిధి’ దాటొద్దు!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు