ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ వాయిదా

27 Sep, 2022 04:53 IST|Sakshi

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణ జరగకపోవడమే కారణం

షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న మొదలుకావాల్సిన రెండో విడత

వచ్చే నెల 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు సాంకేతిక విద్య కమిషనర్‌ ప్రకటన

ఫీజులపై ఎఫ్‌ఆర్సీ ముందు పలు కాలేజీల అప్పీలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ఫీజులపై స్తబ్దత కారణంగా ఈ నెల 28 నుంచి జరగాల్సిన ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. ఈ కౌన్సెలింగ్‌ను వచ్చే నెల 11 నుంచి చేపడతామని సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి అక్టోబర్‌ 16న సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో ఈ నెల 6న తొలి విడత ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు చేపట్టారు.

మొత్తం 71,286 సీట్లుంటే.. విద్యార్థుల ఆప్షన్లకు అనుగుణంగా 60,208 సీట్లను భర్తీ చేశారు. 11,078 సీట్లు మిగిలిపోయాయి. వీటికితోడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన కంప్యూటర్‌ కోర్సుల సీట్లను కలిపి రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయాల్సి ఉంది. అన్నీ కలిపి 25 వేలకుపైగా సీట్లు ఉండవచ్చని అంచనా వేశారు.

ఫీజుల నిర్ధారణలో జాప్యం
రెండో విడత కౌన్సెలింగ్‌ నాటికి ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజులను నిర్ధారించాలనుకున్నారు. ఇందుకు అనుగుణంగానే ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎఫ్‌ఆర్‌సీ) కసరత్తు చేసింది. జూలైలోనే ఎఫ్‌ఆర్సీ రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల ఆడిట్‌ నివేదికలను పరిశీలించి, ఫీజులను నిర్ణయించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా 2019–22 బ్లాక్‌ పీరియడ్‌లో ఉన్న ఫీజులనే కొనసాగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ ఈ నిర్ణయంపై 81 కాలేజీలు కోర్టును ఆశ్రయించడం, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ఎఫ్‌ఆర్సీ తిరిగి కాలేజీల ఆడిట్‌ నివేదికలను పరిశీలించింది.

తొలిదశ ఆడిట్‌ నివేదికల పరిశీలనలో తప్పులు జరిగాయని, మళ్లీ పరిశీలించి వాటిని సరిచేశామని ప్రకటించింది. ఈ మేరకు చాలా కాలేజీల ఫీజులు తగ్గుతున్నట్టు ఎఫ్‌ఆర్సీ వర్గాలు తెలిపాయి. మరోవైపు రెండో విడత చర్చల్లో తమ వాదన వినిపించేందుకు సరైన సమయం ఇవ్వలేదని కొన్ని కాలేజీలు ఎఫ్‌ఆర్సీకి అప్పీలు చేశాయి. దీనితో ఆయా కాలేజీల ప్రతినిధులతో మరో దఫా చర్చించాలని నిర్ణయించారు. ఫీజుల వ్యవహారం తేలకుండా కౌన్సెలింగ్‌కు వెళ్లడం సరికాదని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఈ మేరకు కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. 

మరిన్ని వార్తలు