జేసీ ప్రభాకర్‌రెడ్డిని రెండోరోజూ ప్రశ్నించిన ఈడీ

9 Oct, 2022 01:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న తాడిపత్రి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు హైదరాబాద్‌ కార్యాలయంలో శనివారం వరుసగా రెండోరోజుసైతం సుదీర్ఘంగా ప్రశ్నించారు. శుక్రవా­రం దాదాపు 9 గంటలపాటు విచారించిన అధికా­రులు... శనివారం ఉదయం 10 గంటల నుంచే ఆయనను ప్రశ్నించడం ప్రారంభించారు.

స్క్రాప్‌గా కొన్న బీఎస్‌–3 వాహనాలను బీఎస్‌–4 వాహనా­లుగా పేర్కొంటూ తప్పుడు పత్రాలు సృష్టించడమే కాకుండా వాటిని విక్రయించేందుకు డమ్మీ కంపెనీలు సృష్టించి భారీ ఎత్తున మనీలాండరింగ్‌కు పా­ల్ప­డినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. అమ్మకాలు, నిధుల మళ్లింపునకు సంబంధించిన ఆధారాలు ముందుంచి జేసీని అధికారులు ప్రశ్నించారు. జేసీ కు­టుంబం నిర్వహిస్తున్న జఠాధర ఇండస్ట్రీస్‌ పేరుతో వాహనాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. తప్పుడు పత్రాల సృష్టికి సంబంధించి గతంలో ఏపీ రవాణా శాఖ నమోదు చేసిన కేసుల వివరాలను కూడా ఈడీ అధికారులు సేకరించినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు