ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు శాశ్వత భవనాలు 

2 Jan, 2023 00:44 IST|Sakshi

ఒక్కో భవనానికి రూ.50 లక్షలు వెచ్చించేందుకు ఈఎస్‌ఐసీ సిద్ధం 

స్థలాల గుర్తింపు బాధ్యత కలెక్టర్లకు అప్పగింత! 

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐ చందాదారులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర కార్మిక శాఖ కార్యాచరణ చేపట్టింది. క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేస్తున్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు అన్ని రకాల వసతులతో శాశ్వత భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 71 డిస్పెన్సరీలున్నాయి. ఇవిగాకుండా కొత్తగా 14 డిస్పెన్సరీలను ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ మంజూరు చేసింది.

ప్రస్తుతమున్న డిస్పెన్సరీల్లో 65 డిస్పెన్సరీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె కాంట్రాక్టు గడువు ముగియడంతో కొన్నింటిని పలుమార్లు మార్పు చేసిన సందర్భాలున్నాయి. డిస్పెన్సరీల మార్పులతో అటు రోగులకు, ఇటు వైద్యులు, సిబ్బందికి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు శాశ్వత భవనాల నిర్మాణానికి కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి డిస్పెన్సరీకి శాశ్వత భవనంకోసం అనువైన స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు అనువైన స్థలాల గుర్తింపు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని కోరింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. 

స్థలాలు గుర్తిస్తే వెంటనే భవన నిర్మాణం.. 
ప్రస్తుతం స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని కార్మిక శాఖ భావిస్తోంది. ఈ దిశగా చర్యలు వేగవంతం చేసింది. స్థలాలను గుర్తిస్తే వెంటనే భవన నిర్మాణాలను చేపట్టేందుకు కార్మిక శాఖ సిద్ధంగా ఉంది. గతవారం ఈఎస్‌ఐసీ ప్రాంతీయ బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిస్పెన్సరీలకు శాశ్వత నిర్మాణాలపైనా చర్చించారు.

ఈ క్రమంలో ఈఐఎస్‌ఐసీ ఉన్నతాధికారులు స్పందిస్తూ శాశ్వత భవనాలను నిర్మించేందుకు అవసరమైన నిధులను ఇచ్చేందుకు కార్పొరేషన్‌ సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు ఒక్కో భవనానికి రూ.50 లక్షలు వెచ్చించేందుకు ముందుకు వచ్చారు. ఈ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిసహాయ సహకారాలను తీసుకుంటామని వివరించారు. చందాదారుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.  

మరిన్ని వార్తలు