నోటీసులు లేకుండా ఎలా? ప్రకృతి వనం పనులు అడ్డుకున్న రైతులు

18 Jul, 2021 04:27 IST|Sakshi
సీఐ రవీందర్‌ కాళ్లు పట్టుకొని వేడుకుంటున్న మహిళా రైతు

పెద్దఅడిశర్లపల్లి: నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని దుగ్యాల గ్రామ పంచాయతీలో ఏర్పాటుచేస్తున్న బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులను శనివారం కొందరు రైతులు అడ్డుకున్నారు. అనేక సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూముల్లో ఎలాంటి నోటీసులు లేకుండా పనులు ఎలా చేస్తారంటూ అధికారులను నిలదీశారు. దీంతో పోలీసులు ఆందోళనకు దిగిన రైతులను అరెస్టు చేశారు. అనంతరం అధికారులు పనులు ప్రారంభించారు. వివరాలిలా ఉన్నాయి.. దుగ్యాల గ్రామ శివారులోని 10.24 ఎకరాలను రెవెన్యూ శాఖ బృహత్‌ పల్లె ప్రకృతి వనం కోసం కేటాయించింది.

1993లో ప్రభుత్వం ఈ భూమిని పేర్వాల ప్రాజెక్టుకు అవసరమైన మట్టికోసం సేకరించింది. మట్టి సేకరించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ భూమిని కోల్పోయిన రైతులే చదును చేసుకొని సాగు చేసుకుంటున్నారు. కాగా పల్లెప్రకృతి వనం ఏర్పాటులో భాగంగా భూమి చుట్టూ కడీలు పాతేందుకు శనివారం ఎంపీఓ మోహన్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ శివశంకర్‌ పంచాయతీ సిబ్బందితో కలసి అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రైతులు కుటుంబ సభ్యులతో కలసి పనులను అడ్డుకున్నారు.

దీంతో సీఐ రవీందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనేక ఏళ్లుగా లక్షల రూపా యలు పెట్టుబడి పెట్టి నీటి కోసం పైపులైన్‌ వేసుకుని సాగు చేస్తున్న భూమిని ఎలాంటి నోటీసు లు లేకుం డా తీసుకోవడం సరికాదని అన్నారు. తమకు చావే శరణ్యమంటూ మహిళలు పోలీసుల కాళ్లు పట్టుకొని న్యాయం చేయాలని వేడుకున్నారు. రైతులు శాంతిం చకపోవడంతో వారిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. భూములు లాక్కొని తమ పొట్ట కొట్టవద్దని రైతులు అంటున్నారు.

మరిన్ని వార్తలు