పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలి

29 Jan, 2023 03:53 IST|Sakshi

సీఎస్‌కు లేఖ రాసిన ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్ర­భు­త్వాన్ని సుపరిపాలన వేదిక(ఎఫ్‌జీజీ) కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి శనివారం లేఖ రాశారు. ఈఎన్‌సీ సమగ్ర సర్వే జరిపి జూరాల నుంచి 70 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని డీపీఆర్‌ తయారు చేయగా.. దానిని సీఎం కేసీఆర్‌ కాదని శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవాలని సూచించార­న్నా­రు.

ఇంత పెద్ద ప్రాజెక్టుపై నిపుణుల రిపోర్టు కాదని రాజకీయ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు. సర్వేకు భిన్నంగా కార్యాలయంలోనే మ్యాపుల ఆధారంతో ఆదరాబాదరాగా రెండు వారాల్లో శ్రీశైలం నుంచి 90 టీఎంసీల నీటిని తీసుకోవ­డానికి డీపీఆర్‌ తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. మరోవైపు ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఎటువంటి పర్యావరణ, ఇతర అనుమతు­ల్లేకుండా మొదలు పెట్టారన్నారని ఆరోపించారు.  ఈ ప్రాజెక్టు కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు, సాలీనా కడుతున్న వడ్డీ, ప్రాజెక్టుకు కావాల్సిన 4,560 మెగావాట్ల విద్యుత్‌ ఎక్కడి నుంచి తెస్తారో ప్రజలకు వివరించాలన్నారు.

మరిన్ని వార్తలు