Dhoolpet : సిలిండర్‌ రీఫిల్లింగ్‌ సెంటర్‌లో ప్రమాదం... ఇద్దరు మృతి

11 Aug, 2021 08:51 IST|Sakshi

టక్కరివాడిలో అక్రమ రీఫిల్లింగ్‌

ఒకరి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు

పేలుడు ధాటికి ఆందోళనకు గురైన కాలనీ వాసులు 

సాక్షి,  హైదరాబాద్‌: ధూల్‌పేట్‌ టక్కరివాడిలో గ్యాస్‌ సిలిండర్‌ రీఫిల్లింగ్‌ చేస్తున్న కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒకరు మృతిచెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. టక్కరివాడిలోని లాల్‌భవన్‌ వెనుక ప్రాంతంలో వీరూ సింగ్‌ (50) కుటుంబ సభ్యులతో కలిసి గ్యాస్‌ రీఫిల్లింగ్‌ కేంద్రాన్ని నడుపుతున్నాడు. సాయంత్రం వేళ అతని భార్య సుత్ర సింగ్‌ కిచెన్‌లో వంట చేస్తుండగా.. కొద్ది దూరంలోనే వీరూ సింగ్‌ అతని కుమారులు మానవ్‌సింగ్‌(22), షేరుసింగ్‌ (25)లు సిలిండర్లలో గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్‌ లీకై మంటలు చెలరేగి ఒక్కసారిగా సిలిండర్‌ భారీ శబ్ధంతో పేలింది. ఈ సంఘటనలో మానవ్‌సింగ్‌ మృతిచెందగా వీరూ సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

పెద్ద కుమారుడు షేరుసింగ్, భార్య సుచిత్ర సింగ్‌లు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. పేలుడు శబ్ధానికి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక అయామయానికి గురై బయటకు పరుగులు తీశారు. పేలుడు సవచారం అందుకున్న గోషామహాల్‌ ఏసీపీ నరేందర్‌ రెడ్డి, మంగళ్‌హాట్‌ ఇన్‌స్పెక్టర్‌ రణవీర్‌రెడ్డి, గోషామహాల్‌ కార్పొరేటర్‌ లాల్‌సింగ్, స్థానికుల సహాయంతో నలుగురిని కంచన్‌బాగ్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మానవ్‌సింగ్‌ మృతిచెందాడు. తండ్రి వీరసింగ్‌ 70 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. తల్లి, పెద్ద కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి.

ఉలిక్కిపడ్డ టక్కరివాడి 
అక్రమంగా గ్యాస్‌ రీఫిలింగ్‌ చేస్తున్న కేంద్రంలో భారీ పేలుడు జరగడంతో టక్కరివాడి ప్రాంతం ఉలిక్కిపడింది. స్థానికులంతా తీవ్ర భయాందోళనకు గురై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏం జరిగిందో తెలియక మొదట అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. రీఫిల్లింగ్‌ కేంద్రంలో ఒక సిలిండర్‌ బ్లాస్ట్‌ కాగా మరో సిలిండర్‌లో గ్యాస్‌ లీక్‌ అవుతుండగా స్థానికంగా నివసించే ఓ వ్యక్తి గమనించి..ఆ సిలిండర్‌ను కట్టెతో జరిపి రోడ్డుపై పడేశాడు. దీంతో ప్రవదం తప్పింది. అనంతరం స్థానికులంతా పోలీసులతో కలిసి ఇంట్లో ఉన్న అన్ని సిలిండర్లను బయట పడవేశారు.  

కరోనాతో కుదేలై..గ్యాస్‌ రీఫిల్లింగ్‌ 
గతంలో ఆటోరిక్షా నడుపుతూ వీరూ సింగ్‌ కుటుంబాన్ని పోషించేవాడు. గత సంవత్సరం నుండి కరోనా మహమ్మారితో ఆటో నడపక...ఉపాధి కోల్పోయాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణ కోసం గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేయడం ప్రారంభించాడు. ఇద్దరు కువరులు కూడా ఉద్యోగాలు కోల్పోయి..ఇంటి పట్టునే ఉంటూ తండ్రికి సహాయపడుతూ వస్తున్నారు. చివరకు గ్యాస్‌ బండ పేలుడులో చిన్న కుమారుడు మానవ్‌సింగ్‌ దుర్మరణం పాలవగా...తండ్రి వీనైసింగ్‌ తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నాడు. కాగా వీరూ సింగ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.25 లక్షలు పరిహారంగా ఇవ్వాలని గోషామహల్‌ కార్పొరేటర్‌ లాల్‌సింగ్‌ డిమాండ్‌ చేశారు. సంఘటనా స్థలాన్ని గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సందర్శించారు. మంగళ్‌హాట్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు