రామగుండం విద్యుత్‌ కేంద్రంలో మంటలు

25 Oct, 2023 02:25 IST|Sakshi

షార్ట్‌ సర్క్యూట్‌తో బీ–థర్మల్‌ ఉత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదం

ఉద్యోగుల అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం

రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని 50 ఏళ్ల నాటి బీ–థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో టర్బయిన్, బాయిలర్‌ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది.

నిప్పురవ్వలు ఎగసిపడటంతో...
రామగుండంలోని బీ–థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో కాలం చెల్లిన పరిజ్ఞానం వినియోగిస్తు న్నారు. ఇందులోని మిల్స్‌ నుంచి బాయిలర్‌లోకి బొగ్గును డంపింగ్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో వివిధ యంత్రాలు, కంట్రోల్‌ రూం వరకు బొగ్గుపొడి (కోల్‌డస్ట్‌) వెదజల్లి నట్లుగా నిండిపోతూ ఉంటుంది.

అయితే బాయిలర్‌ ప్రాంగణంలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిందని, నిప్పురవ్వలు బొగ్గుపొడిపై పడటంతో మంటలు చెలరేగి సమీపంలోని రబ్బర్‌ కేబుల్స్‌కు అంటుకొని విద్యుత్‌ కేంద్రం ట్రిప్‌ అయిందని అధికారులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సకాలంలో ఫైరింజిన్‌ ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చిందని చెప్పారు.

పునరుద్ధరించిన కొన్ని గంటల్లోనే ట్రిప్‌..
ఈ కేంద్రంలో సెప్టెంబర్‌ 12 నుంచి వార్షిక మరమ్మతులు ప్రారంభించిన అధికారులు వాటిని నెల రోజుల్లో పూర్తిచేసి విద్యుత్‌ కేంద్రాన్ని తిరిగి ఉత్పత్తి దశలోకి తీసుకురావాలనుకున్నా పరిస్థితులు అనుకూలించక 45 రోజులు పట్టింది. ఈ నెల 20న అర్ధరాత్రి ఉత్పత్తి దశలోకి తీసుకురాగా కొన్ని గంటలపాటు విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. ఈ క్రమంలోనే భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మరోసారి విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. మళ్లీ పునరుద్ధరణ పనులు పూర్తి చేసేందుకు కనీసం 10 రోజులపైనే పడుతుందని అధికారులు అంటున్నారు.

మరోవైపు ఆస్తి నష్టం వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. సాధారణంగా విద్యుత్‌ కేంద్రం జీవితకాలం 25 ఏళ్లుకాగా బీ–థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం స్థాపించి సుమారు 50 ఏళ్లు గడుస్తోంది. విద్యుత్‌ సౌధకు చెందిన పలువురు నిపుణులు ఇటీవల ఈ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించి 2029 వరకు దీన్ని కొనసాగించేందుకు అవకాశం ఉందని అంచనా వేశారు.

మరిన్ని వార్తలు