సకాలంలో సత్యాన్ని వెలికితీయాలి 

5 Feb, 2023 03:33 IST|Sakshi
సదస్సులో పాల్గొన్న జస్టిస్‌ యు.యు. లలిత్, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, వీసీ కృష్ణదేవరావు తదితరులు  

దీనిలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ పాత్ర కీలకం 

నల్సార్‌ వర్సిటీ సదస్సులో మాజీ సీజేఐ జస్టిస్‌ యు.యు. లలిత్‌

సాక్షి, హైదరాబాద్‌: నేరాలు జరిగినప్పుడు సకాలంలో సత్యాన్ని వెలికితీయడం కత్తిమీద సాము లాంటిదని, దీనిలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రధాన భూమిక పోషిస్తుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు. లలిత్‌ అన్నారు. ట్రూత్‌ ల్యాబ్‌ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఫోరెన్సిక్‌ సైన్స్‌ వినియోగంపై నల్సార్‌ యూనివర్సిటీ శనివారం ఇక్కడ నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు.

క్రిమినల్‌ కేసుల్లోనే కాదు, సివిల్‌ కేసుల్లోనూ ఫోరెన్సిక్‌ సైన్స్‌ సేవలు అందించాలని సూచించారు. పరిశోధనకు కొత్త మార్గాలను అనుసరించడంతోపాటు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని మరో మాజీ సీజేఐ జస్టిస్‌ ఎంఎన్‌ వెంకటాచలయ్య అభిప్రాయపడ్డారు. శాస్త్రీయంగా సాక్ష్యాన్ని సమర్థవంతంగా రూపొందించడంలో ఫోరెన్సిక్‌ పాత్ర కీలకమైనదని అన్నారు.  

ఆధారాలను వెలికితీయడంలో... 
న్యాయ రంగంలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ సహకారం అవసరమని, తద్వారా క్రిమినల్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించే వీలు కలుగుతుందని తమిళనాడు మాజీ గవర్నర్‌ రాంమోహన్‌రావు అన్నారు. క్రిమినల్‌ కేసులు, మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో ఆధారాలను వెలికితీసేందుకు ఫోరెన్సిక్‌ సైన్స్‌ తోడ్పడుతుందని తెలంగాణ హైకోర్టు సీజే, నల్సార్‌ వర్సిటీ చాన్స్‌లర్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ వ్యాఖ్యానించారు.

ఫోరెన్సిక్‌ సైన్స్‌ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను పెంచాలని మాజీ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ సూచించారు. రాంమోహన్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ అరుణ్‌మిశ్రా, లా కమిషన్‌ ఆఫ్‌ ఇండియా మాజీ చైర్మన్‌ జస్టిస్‌ ఎం.జగన్నాథరావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీవీ రెడ్డి తదితరులు మాట్లాడారు. డీజీపీ అంజనీకుమార్, మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ భవానీ ప్రసాద్, జస్టిస్‌ రఘురామ్, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కృష్ణదేవరావు, డా.గాంధీ పీసీ కాజా, పలువురు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు