ఐదు కుటుంబాల్లో విషాదం

5 Oct, 2023 08:56 IST|Sakshi

హైదరాబాద్: ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని గాయపడ్డ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా వివిధ కారణాలతో మరో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన మృతి చెందిన ఘటనలు బుధవారం కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చాయి. ఉప్పల్‌ పరిధిలో మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుషాయిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  

గ్యాస్‌ సిలిండర్‌ లీకైన ఘటనలో.. 
హెచ్‌బీకాలనీ, వెంకటేశ్వరనగర్‌ కాలనీలో నివసించే శాంతం భాగ్యమ్మ(48) ఇళ్లలో పని చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. గత నెల 19న ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్‌ సిలిండర్‌ లీకై మంటలు చీరకు అంటుకున్నాయి. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది.  

కుటుంబ కలహాలతో గృహిణి.. 
కుటుంబ కలహాల కారణంగా మనస్థాపం చెందిన గృహిణి ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందిన ఘటన హెచ్‌బీకాలనీ, కృష్ణానగర్‌లో చోటు చేసుకుంది. వెస్ట్‌ గోదావరికి చెందిన శ్రీకాంత్, హైమగంగా భవానీ దంపతులు 3 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నాడు. వారికి రెండు సంవత్సరాల వయసు ఉన్న పాప ఉంది. మంగళవారం మధ్యాహ్నం భార్యాభర్తల నడుమ గొడవ జరిగింది. మనస్థాపం చెందిన భవాని భర్త నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందింది.  

ప్రేమ విఫలమై.. 
ప్రేమ విఫలమైందని మనస్థాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందిన ఘటన హెచ్‌బీకాలనీలో చోటుచేసుకుంది. ఎల్‌ఐజీకి చెందిన విద్యార్థి హబ్సీగూడలోని ఓ ప్రైవేటు కళాశాలలో  డిగ్రీ చదువుతున్నాడు. ప్రేమ విఫలమైందన్న కారణంతో ఇంటో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందాడు. 

ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. 
ఆర్థిక ఇబ్బందులతో ఓ సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందాడు. జార్ఖాండ్‌కు చెందిన సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ దినేష్‌ దాస్‌ రెండు సంవత్సరాల క్రితం బదిలీపై నగరంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌ఎఫ్‌సీకి వచ్చాడు. భార్యతో కలిసి ఎన్‌ఎఫ్‌సీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. సంతానం లేరు. అప్పుల బాధ తాళలేక ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందినట్లు ఎస్‌ఐ వెంకన్న తెలిపారు.  

అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య 
ఉప్పల్‌: అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్‌ హనుమసాయినగర్‌లో నివాసముండే శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు అన్విత్‌రెడ్డి(25) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మనస్థాపానికి గురై బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.  

ముఖ్య గమని​క:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు