Telangana: ఉచిత చేప పిల్లల పంపిణీ: తలసాని

4 Sep, 2022 01:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఈనెల 5 నుంచి ఉంటుందని, దీన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అత్యాధునిక సాం­కేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని మత్స్య శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. శనివారం మత్స్యశాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

చేపపిల్లల పంపిణీకి మత్స్య మిత్ర యాప్‌ను ప్రారంభించారు. ఈ ఏడాది 26,778 నీటి వనరుల్లో రూ.68 కోట్ల వ్యయంతో 88.53 కోట్ల చేపపిల్లలను విడుదల చేస్తామన్నారు. చేపపిల్లలను సరఫరా చేసే వాహనం నెంబర్, డ్రైవర్‌ వివరాలు, ఫోన్‌ నెంబర్‌ వివరాలను ఈ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. చేప పిల్లలను ఏ నీటి వనరులో ఎన్ని విడుదల చేశారు? ఏ రకం విడుదల చేశారు? అనే వివరాలు, ఫొటోలు ఏ రోజుకారోజు యాప్‌లో నమోదు చేయాలన్నారు.

ఈ యాప్‌ వినియోగం వలన కలిగే ఉపయోగాలను మత్స్యకారులకు కూడా అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ యాప్‌ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చేప పిల్లల విడుదల ప్రక్రియను పర్యవేక్షించడానికి కమిషనర్‌ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తలసాని వెల్లడించారు. సైజ్, నాణ్యత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న చేప పిల్లలను మాత్రమే విడుదల చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని చెరువుల్లో నీటి నిల్వలను పర్యవేక్షించేందుకు 26 వేలకుపైగా నీటి వనరులను జియోట్యాగింగ్‌ చేసినట్లు వెల్లడించారు. కాగా, సోమవారం జనగామ జిల్లా ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌లో మంత్రి చేపపిల్లలను విడుదల చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

మరిన్ని వార్తలు