Gandhi Medical College: వైద్యుల తయారీలో అరవై ఏడు వసంతాలు

14 Sep, 2021 17:34 IST|Sakshi
ప్రస్తుత గాంధీ మెడికల్‌ కాలేజీ 

నేడు గాంధీ మెడికల్‌ కళాశాల ఆవిర్భావ దినోత్సవం

పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో వేడుకలు

సాక్షి, హైదరాబాద్‌: నిష్ణాతులైన వైద్యులను తయారు చేయడంలో సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కళాశాల అరవై ఏడు వసంతాలు పూర్తి చేసుకుంది. 1954 సెపె్టంబర్‌ 14న పీపుల్స్‌ మెడికల్‌ కాలేజీగా ఆవిర్భవించి తర్వాత గాంధీ మెడికల్‌ కళాశాలగా దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిలిచింది. అస్వస్థతలు, రోగాల నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రపంచ దేశాల్లోనూ వైద్యసేవలను అందిస్తున్న వేలాది మంది నిష్ణాతులైన వైద్యులు వైద్య భాషలో ఓనమాలు దిద్దింది ఇక్కడే. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సమయంలో మేమున్నాం.. అనే భరోసా ఇచ్చి మేలైన వైద్యసేవలు అందించి వేలాది మందికి పునర్జన్మ ప్రసాదించింది గాంధీ వైద్యులే.

అందుకే ఈ కళాశాలను వైద్యులను తయారు చేసే కర్మాగారంగా అభివర్ణిస్తారు. ప్రజల సేవ కోసం పీపుల్స్‌ కాలేజీగా ఆవిర్భవించి, దేశ ప్రజల బానిస సంకెళ్లను తెంచిన జాతిపిత మహాత్మాగాంధీ పేరుతో కొనసాగుతూ మేలిమి వైద్య వజ్రాలను ప్రపంచానికి అందిస్తోంది సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీ. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అలుమ్నీ భవనంలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో డీఎంఈ రమే‹Ùరెడ్డి, గాంధీ ప్రిన్సిపాల్‌ ప్రకాశరావు, సూపరింటెండెంట్‌ రాజారావు, అలుమ్నీ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రాజారెడ్డి, జీఎంసీ అలుమ్నీ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కే.లింగయ్య ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు, వైద్యవిద్యలో ప్రతిభ చూపిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్‌ అందిస్తామని అలుమ్నీ అధ్యక్ష, కార్యదర్శులు ప్రతాప్‌రెడ్డి, లింగమూర్తి తెలిపారు.
చదవండి: బ్యాండ్‌ లేకపోతేనేం.. చిన్నారుల ఆలోచన అదిరిపోయింది 

వైద్యవిద్యార్థులకు ప్రోత్సాహం 
రెండు దశాబ్దాలుగా అలుమ్నీ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు మరింత ఉన్నతమైన విద్యను అభ్యసించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని అలుమ్నీ కార్యదర్శి డాక్టర్‌ జీ.లింగమూర్తి తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు బంగారు పతకాలు అందిస్తున్నామని వివరించారు.  
– డాక్టర్‌ లింగమూర్తి, అలుమ్నీ కార్యదర్శి  

మరిన్ని వార్తలు