కన్నుల పండువగా గణేశ్‌ నిమజ్జనం

29 Sep, 2023 01:26 IST|Sakshi
గురువారం హైదరాబాద్‌ సెక్రటేరియట్‌ వద్ద భక్తజన సందోహం మధ్య ఖైరతాబాద్‌ గణేశ్‌ శోభాయాత్ర, (ఇన్‌సెట్‌) ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జన దృశ్యం ,

ప్రశాంతంగా ముగిసిన వేడుకలు 

ఆధ్యాత్మికతను సంతరించుకున్న భాగ్యనగరం 

సకాలంలో గంగ ఒడికి చేరిన మహాగణపతి  

హెలికాప్టర్‌ నుంచి పరిశీలించిన మంత్రులు, డీజీపీ 

సాక్షి, హైదరాబాద్‌: గణపతి నిమజ్జన వేడుకలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. వేల సంఖ్యలో వినాయక విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో విగ్రహాలు, భక్తులతో రహదారులు కిటకిటలాడాయి. నగరం నలువైపుల నుంచి తరలి వచ్చిన భక్తజన సందోహంతో సాగరతీరం సందడిగా మారింది. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌ రోడ్డు, పీపుల్స్‌ప్లాజా తదితర ప్రాంతాల్లో ‘జై బోలో గణపతి మహారాజ్‌కీ జై ’అంటూ నినాదాలు హోరెత్తాయి. వైవిధ్య భరితమైన వినాయక మూర్తుల నిమజ్జన వేడుకలు కన్నుల పండువగా జరిగాయి.

భక్తుల నినాదాలు, నృత్యాలతో కూడిన శోభాయాత్రతో మహానగరం ఆధ్మాత్మికతను సంతరించుకుంది. 63 అడుగుల ఖైరతాబాద్‌ శ్రీ దశ మహావిద్యా గణపతి నిమజ్జన వేడుకలు మధ్యాహ్నం 1.27 గంటలకే ముగిశాయి. ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్త జనందోహం నడుమ శోభాయాత్ర ప్రశాంతంగా సాగింది. ఉదయం 6.12 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర సెన్సేషన్‌ థియేటర్‌.

రాజ్‌దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్, ఇక్బాల్‌ మీనార్, సచివాలయం, ఎన్టీయార్‌మార్గ్‌ మీదుగా ఉదయం 11.40 గంటలకు 4వ నంబర్‌ క్రేన్‌ వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం 12.24 గంటలకు చివరి పూజ నిర్వహించిన గంట తరువాత మహాగణపతిని నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు. అన్ని విభాగాల సహకారంతో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఖైరతాబాద్‌ మహాగణపతికి ప్రత్యేకత ఉందని పది రోజుల్లో 50 లక్షల మంది దర్శించుకున్నారని చెప్పారు. 

గురువారం నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ మార్గ్‌లో భారీగా పోటెత్తిన భక్త జనం 

వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ 
మహాగణపతి నిమజ్జన వేడుకలు ముగిసిన తర్వాత వివిధ ప్రాంతాల నుంచి బొజ్జ గణపయ్యలు సాగరతీరంలో నిమజ్జనానికి తరలివచ్చారు. మధ్యలో స్వాగత వేదికలు గణపతులకు సాదర స్వాగతం పలికాయి. రకరకాల ఆకృతులలో అందంగా రూపుదిద్దుకున్న మూషికవాహనుడి విగ్రహాలు ఆకట్టుకున్నాయి. తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం అలంకరణలో ఏర్పాటు చేసిన మండపాలు, విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, జీమెయిల్‌ వంటి సోషల్‌ మీడియాను ప్రతిబింబించే చిన్న చిన్న విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి నిమజ్జనానికి తీసుకొచ్చారు. అబిడ్స్, ఎల్‌బీనగర్, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పండ్లతో అలంకరించిన విగ్రహాలు, కాగితంతో అందంగా తీర్చిదిద్దిన పర్యావరణ గణపతులు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. 

హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కోసం అమరవీరుల స్మారక చిహ్నం వద్ద బారులు తీరిన వినాయక విగ్రహాలు 

ఏరియల్‌ నిఘా 
రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్‌ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసేందుకు పోలీస్‌శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీ స్‌ కమిషనర్లు వినాయక నిమజ్జన ప్రాంతాలు పరిశీలించారు. హైదరాబాద్‌ పరిధిలో గణేశ్‌ నిమజ్జన కార్యక్రమాన్ని మంత్రులు మహమూ ద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి డీజీపీ అంజనీకుమార్‌ ఏరియల్‌ వ్యూ ద్వారా పర్యవేక్షించారు.

హెలికాప్టర్‌లో శోభాయాత్రను, హుస్సేన్‌ సాగర్‌ వద్ద నిమజ్జనాలు జరుగుతున్న తీరును పరిశీలించారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ కూడా పాల్గొన్నారు. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా కూడా శోభయాత్రను పరిశీలించారు. సీసీటీవీ కెమెరాల లైవ్‌ ఫీడ్‌ను చూస్తూ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.   

నగరం ఆధ్యాత్మిక సంద్రమైంది. ఎటుచూసినా భక్తజన సందోహం.. అంతటా గణనాథుని నిమజ్జన వేడుకల కోలాహలం.. దారిపొడవునా వినాయకులకు ఘన స్వాగతాలు.. ట్యాంక్‌బండ్‌లు, చెరువుల వద్ద వీడ్కోళ్లు.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. 63 అడుగుల ఖైరతాబాద్‌ శ్రీ దశ మహావిద్యా గణపతి నిమజ్జనోత్సవం మధ్యాహ్నం 1.27 గంటలకే ముగిసింది.  

మరిన్ని వార్తలు