మీసేవా కేంద్రాలకు వెళ్లద్దు: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

7 Dec, 2020 10:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో వరద సాయం రూ. 10 వేల కోసం బాధితులు సోమవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు మీసేవా కేంద్రాల వద్ద బాధితులు బారులు తీరారు. ఈ క్రమంలో తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ మీసేవా కేంద్రాల నిర్వాహకులు తెలియాజేస్తున్నారు. వరద సాయం బాధితులు భారీగా రావడంతో నిర్వాహకులు మీసేవా కేంద్రాలకు తాళాలు వేశారు. దీంతో పెద్ద సంఖ్యలో మీసేవా కేంద్రాల వద్ద ఆందోళన నేలకొంది. మీసేవా కేంద్రాల వద్ద బాధితుల క్యూ పెరగడంతో జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్.లోకేష్ కుమార్ స్పందించారు.

వరద సాయంపై ఆయన కీలక ప్రకటన చేశారు. వరద సాయం కోసం బాధితులు మీ సేవా కేంద్రాలకు వెళ్లవద్దని పేర్కొన్నారు. నగరంలో జీహెచ్‌ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని వెల్లడించారు. వరద సాయం కోసం  బాధితుల వివరాలు సేకరిస్తారని తెలిపారు. బాధితుల వివరాలు, ఆధార్ నంబర్‌ ధ్రువీకరించిన తర్వాత వరద బాధితుల అకౌంట్‌లో డబ్బు జమఅవుతాయిని ఆయన వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో వరద బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, సీఎం కేసీఆర్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ‌సభలో మాట్లాడుతూ.. డిసెంబర్ 7 నుంచి అర్హులైనవారందరికీ రూ.10వేల వరద సాయం అందజేస్తామన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు