ప్యార్‌ పైసా చాహియే!

19 Dec, 2023 11:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ..రాజధాని నగరమైన హైదరాబాద్‌ అభివృద్ధి ఎలాంటి దిశను తీసుకుంటుందోనని సర్వత్రా చర్చలు సాగుతున్నాయి. మునిసిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖను ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి తనవద్దే ఉంచుకోవడంతో అందులో భాగమైన జీహెచ్‌ఎంసీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..ఏయే పనులు చేపడతారోనని అటు అధికారులు.. ఇటు నగర ప్రజలు ఎదురు చూస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పనులపై సమీక్ష నిర్వహిస్తే.. సీఎం మనోగతం వెల్లడి కాగలదని భావిస్తున్నారు. 

ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనుల పూర్తికి శ్రద్ధ చూపుతారా..లేక కొత్త పనులు చేపడతారా అన్న చర్చలు జీహెచ్‌ఎంసీ వర్గాల్లో సాగుతున్నాయి. మరోవైపు నగరానికి సంబంధించి కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలకు ప్రాధాన్యతనిస్తారా? ముఖ్యంగా ఆస్తిపన్ను బకాయిలపై పెనాల్టీలు ఎప్పుడు ఎత్తివేస్తారోనని పలువురు ఎదురు చూస్తున్నారు. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పురపాలికల్లో ఆస్తిపన్ను, ఇంటిపన్ను బకాయిలపై పెనాల్టీలను రద్దుచేస్తామని హామీనిచ్చారు. దానితో పాటు మరికొన్ని హామీలిచ్చారు. వాటిల్లో నగర ప్రజలకు సంబంధించిన వాటిల్లో దిగువ పేర్కొన్నవి ఉన్నాయి. 

తెల్ల రేషన్‌కార్డులున్న ఇళ్ల యజమానులకు ఇంటి పన్ను తగ్గింపు. 
►మురికివాడల్లోని పేదలకు కాలనీల్లోని వారి మాదిరిగా నీరు, విద్యుత్, డ్రైనేజీ, విద్య, ఆరోగ్యం వంటి అంశాల్లో నాణ్యమైన ప్రాథమిక సేవలు. సబ్సిడీతో కూడిన సర్విస్  కార్డులు.   
► నాంపల్లి, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు కలుపుతూ స్కైవాక్‌ల నిర్మాణం. 
► పార్కింగ్‌ సమస్య పరిష్కారానికి పార్కింగ్‌ కాంప్లెక్సుల నిర్మాణం.  
► బస్తీ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు ద్వారా పేద ప్రజల పిల్లలకు ఆధునిక విద్య. 
► సెట్విన్‌ బస్సుల్ని పెంచి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల పెంపు. 
► ఎల్‌బీ నగర్‌– బీహెచ్‌ఈఎల్‌ (వయా ఆరాంఘర్, మెహిదీపట్నం, గచి్చ»ౌలి)మార్గాల్లో కొత్త మెట్రోలైన్ల విస్తరణ.  
► మురికివాడల సమగ్రాభివృద్ధి కోసం స్లమ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు.  
► ప్రతి ఇంటికీ 25 వేల లీటర్ల మంచినీరు ఉచిత సరఫరా.

 ప్రాజెక్టులకు నిధులు కావాలి.. 
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ చిక్కుల పరిష్కారానికి ఎస్సార్‌డీపీ కింద 42 పనులు చేపట్టగా వాటిల్లో 32 పూర్తయ్యాయి. మరో 9 పురోగతిలో ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు రూ.6 వేల కోట్లు ఖర్చు కాగా, పురోగతిలోవి పూర్తయ్యేందుకు మరో వెయ్యి కోట్లు కావాలి.  ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన జీహెచ్‌ఎంసీకి మళ్లీ అప్పుచేసే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఆ నిధులు విడుదల చేసి మిగిలిన పనులు పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. వరద నివారణ పనుల కోసం ఎస్‌ఎన్‌డీపీ కింద తొలిదశలో దాదాపు వెయ్యి కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. అవి సగమే పూర్తయ్యాయి. వాటిని పూర్తిచేయడంతోపాటు రెండో దశకు అవసరమైన నిధులు కేటాయించాలి. రెండో దశ పనులకు గ్రేటర్‌ లోపల, వెలుపల వెరసి రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చుకాగల పనులకు ప్రతిపాదనలు చేశారు. సమస్య పరిష్కారానికి  పాత ప్రతిపాదనల పనులే చేస్తారా? లేక కొత్త ప్రణాళికలు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఏం చేసినా సదుపాయవంతమైన జీవనం కలి్పస్తే బాగుంటుందని నగర ప్రజలు ఆశపడుతున్నారు.  

వీటికీ ప్రాధాన్యం ఇవ్వండి.. 
మేనిఫెస్టోలో పేర్కొన్న వాటితోపాటు..పేర్కొనని దిగువ సమస్యలనూ పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. 
► వరద ముంపు లేకుండా నాలాల ఆధునీకరణ. దశాబ్దాల తరబడి ఈ సమస్యకు వివిధ ప్రభుత్వాలు చర్యలకు శ్రీకారం చుట్టినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోనూ ఈ అంశం ఉంది. చెరువుల్ని ప్రక్షాళన చేసి నీరు నిలిచేలా చేయడం.. ఒక చెరువు నిండాక దిగువప్రాంతాల్లోని చెరువులకు వెళ్లేలా చేయడం వల్ల కూడా ఈ సమస్య తగ్గుతుంది.   
► మేనిఫెస్టోలో ఉన్న మరో అంశం పార్కింగ్‌. నగరంలో పార్కింగ్‌ సమస్య వాహనదారులందరికీ తెలిసిందే. అడ్డగోలు పార్కింగ్‌ చార్జీలను కూడా అరికట్టాలని 
కోరుతున్నారు. 
► నగరంలో ప్రధాన రహదారులు కాస్త బాగున్నా..కాలనీల్లోని రోడ్లు పరమ అధ్వానంగా మారాయి. ప్రధాన రహదారులతోపాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ సాఫీ ప్రయాణం సాగేలా, వర్షం వచి్చనా ఇబ్బందుల్లేకుండా రోడ్లుండాలి. 
►మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బాగుంది. దాంతోపాటు అవసరమైన అన్ని మార్గాల్లో బస్సుల సంఖ్య పెంచి ఇబ్బందుల్లేకుండా చూడాలి. మెట్రో స్టేషన్ల నుంచి లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ సదుపాయానికి 
మినీబస్సులు నడపాలి.  
► నగరంలో తరచూ అగి్నప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకు చెప్పుకోదగ్గ కారణాల్లో అక్రమ నిర్మాణాలు ఒకటి. అక్రమ నిర్మాణాలను అరికట్టాలి.   

>
మరిన్ని వార్తలు