ఇవి భద్రాద్రిలో మాత్రమే ప్రత్యేకం.. 170 క్వింటాళ్లు సిద్ధం..

31 Mar, 2022 20:02 IST|Sakshi
తలంబ్రాల తయారీలో మహిళా భక్తులు 

సీతారాముల కల్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత

తానీషా కాలం నుంచి సంప్రదాయంగా సమర్పణ 

గోటి తలంబ్రాలు తీసుకొస్తున్న ఇరు రాష్ట్రాల భక్తులు

ఈ ఏడాది 170 క్వింటాళ్లు సిద్ధం

భద్రాచలం: ‘జానకి దోసిట కెంపుల బ్రోవై.. రాముడి దోసిట నీలపు రాశై.. ఆణిముత్యములే తలంబ్రాలుగా.. ఇరముల మెరిసిన సీతారాముల కల్యాణము చూతము రారండి’ అంటూ సీతా రాముల కల్యాణంలో తలంబ్రాల విశిష్టతను వివరించారో సినీ రచయిత. శ్రీరామనవమి రోజున భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల కల్యాణాన్ని  తిలకించిన భక్తులు పునీతులవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. స్వామి వారి కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను పొందేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తారు. స్వామి, అమ్మవారి నుదుటిపై జాలు వారే తలంబ్రాలను తమపై చల్లుకుంటే ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయని వారి విశ్వాసం. అలాంటి తలంబ్రాలను పొందేందుకు భక్తుల రద్దీ ప్రతి ఏడాది పెరుగుతోంది. దీంతో ఈ సంవత్సరం అత్యధికంగా 170 క్వింటాళ్ల తలంబ్రాలు తయారు చేస్తున్నారు. 

భద్రాద్రిలో మాత్రమే ప్రత్యేకం..
అక్షతలు అంటే శాశ్వతమైనవని, నశించిపోని సుఖాలను కలుగజేసేవని పండితులు చెబుతున్నారు. వధూవరులు జీవితాంతం ఒకరికొకరు సహకరించుకుంటూ సుఖశాంతులతో గడపాలని కోరుకుంటూ ఇలా ఒకరి తలపై మరొకరు అక్షతలు పోసుకుంటారని, అయితే ఆది దంపతులైన సీతా రాముల శిరస్సుపై నుంచి జాలువారే ఈ తలంబ్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని అంటున్నారు. ముత్యం చంద్రునికి గుర్తు. చంద్రుడు మనసుకు అధిపతి. మనసుకు ప్రశాంతత కలిగించేవాడు చంద్రుడు గనుక అతడికి గుర్తుగా ముత్యాలను తలంబ్రాలలో కలుపుతారు. ఆలుమగల దాంపత్యం మనసుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇలా ముత్యాలు కలిపిన తలంబ్రాలను శిరస్సుపై పోసుకోవడం ద్వారా వారి మధ్య మరింత అనురాగం పెంపొందుతుందని, అన్యోన్యంగా జీవించడానికి ప్రతీకగా భద్రాచలంలో ముత్యాల తలంబ్రాలను శ్రీ సీతారాముల తిరుకల్యాణోత్సవంలో ఉపయోగిస్తామని పండితులు వివరిస్తున్నారు.  

తానీషా కాలం నుంచి ఆచారం.. 
భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణంలో భక్తులతో పాటు రాజ్యమంతా (ప్రభుత్వం) రామ య్య సేవలో పాలుపంచుకోవాలనే తలంపుతో నిజాం నవాబు తానీషా ప్రభువు ముత్యాలను సమర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా దీన్ని కొనసాగించేలా శాసనాన్ని తీసుకొచ్చారు. ఆ ఆనవాయితీ ప్రకారం నేటికీ ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పిస్తున్నారు. 

గోటి తలంబ్రాలతో భక్తుల రాక.. 
తలంబ్రాల తయారీలో ఉపయోగించే వరి ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులు నియమ నిష్టలతో పండించి ఒడ్లను గోటితో ఒలిచి రామయ్య కల్యాణానికి సమర్పించటం విశేషం. ఏపీలోని జంగారెడ్డిగూడెం, రాజమండ్రి, కోరుకొండ, చీరాల, తెలంగాణలోని ఇల్లెందు, జయశంకర్‌ భూపాలపల్లి, హైదరాబాద్‌ ప్రాంతాలకు చెందిన భక్తులు ఇలా తలంబ్రాలు అందజేస్తున్నారు. ప్రతి ఏడాది గోటితో ఒలిచిన తలంబ్రాలు సుమారు 6 క్వింటాళ్ల వరకు వస్తుండగా, ఇతర భక్త సమాజాలు, సారపాక ఐటీసీ వంటి స్వచ్ఛంద సంస్థలు 100 క్వింటాళ్ల బియ్యం అందిస్తున్నాయి. కాగా తలంబ్రాలకు పెరుగుతున్న భక్తుల ఆదరణ దృష్ట్యా ఈ ఏడాది అత్యధికంగా 170 క్వింటాళ్లు సిద్ధం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు