రూ.6200 కోట్లతో ‘కాపిటాలాండ్‌’ 

7 Dec, 2022 03:18 IST|Sakshi

హైదరాబాద్‌లో 36 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు 

వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో రూ.5వేల కోట్ల పెట్టుబడులు 

కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పందం 

2024 చివరి నాటికి డేటా సెంటర్‌ అందుబాటులోకి

సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌లోని హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ టెక్‌ పార్క్‌ (ఐటీపీహెచ్‌)లో డేటా సెంటర్‌ వృద్ధికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, కాపిటాలాండ్‌ ఇండియా ట్రస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (క్లైంట్‌) నడుమ మంగళవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. 2.50లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ డేటా సెంటర్‌ 36 మెగా వాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తొలిదశలో రూ.1200 కోట్ల అంచనా పెట్టుబడితో వృద్ధి చేసే ఈ డేటా సెంటర్‌ వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో కార్యకలాపాలు ప్రారంభిస్తుంది.

రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందంపై ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, క్లైంట్‌ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసే ఈ డేటా సెంటర్‌లో కూలింగ్, భద్రత వంటి ఆధునిక సౌకర్యాలతో పాటు ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ కూడా ఏర్పాటు చేస్తారు.

హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌ను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేసి ఆరు లక్షల చదరపు అడుగులకు విస్తరిస్తామని, రెండో దశలో భాగంగా మరో రూ.5వేల కోట్ల పెట్టుబడి పెడుతామని క్లైంట్‌ వెల్లడించింది. కేవలం డేటా సెంటర్‌ వృద్ధికే పరిమితం కాకుండా క్లైంట్‌ లాజిస్టిక్స్, సౌర విద్యుత్‌ ప్లాంట్ల వంటి మౌలిక వసతుల రంగంలోనూ తన కార్యకలాపాలను విస్తరిస్తామని వెల్లడించింది.  

డేటా సెంటర్లలో హైదరాబాద్‌ వృద్ది 
భారత్‌లో డేటా సెంటర్ల రంగంలో హైదరాబాద్‌ అతివేగంగా వృద్ధి చెందుతోందని మంత్రి కేటీ రామారావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాపిటాలాండ్‌తో కేవలం డేటా సెంటర్ల రంగంలోనే కాకుండా ఇతర మౌలిక వసతుల కల్పన రంగంలోనూ తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందన్నారు. కాపిటాలాండ్‌ వచ్చే ఐదేళ్లలో ఆఫీస్‌ స్పేస్‌ను రెట్టింపు చేయడం హైదరాబాద్‌ ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని కేటీఆర్‌ అన్నారు.

యూరోప్, ఆసియా ఖండంలో 25 డేటా సెంటర్లను కలిగిన క్లైంట్‌ భారత్‌లో రెండో డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో వృద్ధి చేస్తుందని చెప్పారు. రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్లైంట్‌కు ఇప్పటికే స్థానికంగా ఐటీపీహెచ్, సైబర్‌ పెరల్, అవెన్స్‌ పేరిట మూడు బిజినెస్‌ పార్కులు ఉన్నాయని సంస్థ సీఈఓ సంజీవ్‌ దాస్‌గుప్తా వెల్లడించారు. 2.8 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు బిజినెస్‌ పార్కులు 30వేల మందికి ఉపాధి కల్పిస్తున్న 70 అంతర్జాతీయ సంస్థల అవసరాలు తీరుస్తున్నాయని చెప్పారు. యూరోప్, ఆసియా దేశాల్లో 500 మెగావాట్ల సామర్ద్యం కలిగిన 25 డేటా సెంటర్లను క్లైంట్‌ అభివృద్ధి చేసిందన్నారు. 

మరిన్ని వార్తలు