మున్సిపాలిటీలకు ఎన్నికలెప్పుడు నిర్వహిస్తారు?

13 Feb, 2021 11:01 IST|Sakshi

కౌంటర్‌ దాఖలు చేయాలని సర్కారుకు హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: పాలకవర్గం గడువు ముగిసిన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. నల్లగొండ జిల్లా నకిరేకల్, మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, రంగారెడ్డి జిల్లా కొత్తూరు, నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట, సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీల పాలకవర్గం గడువు ముగిసినా ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని, ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారో పేర్కొంటూ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది.

పాలకవర్గం ముగిసినా ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడం లేదని, ఎన్నికలు వెంటనే నిర్వహించేలా ఆదేశించాలంటూ వరంగల్‌ పట్టణానికి చెందిన ఎం.ధర్మారావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. ఆ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించడం లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిన్నోళ్ల నరేశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. డీలిమిటేషన్‌ ప్రక్రియలో భాగంగానే కొంత జాప్యం జరుగుతోందని అడ్వొ కేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. ఈ ప్రక్రియ పూర్తవగానే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.  ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారో స్పష్టం చేస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు