తెలంగాణలో వానలే వానలు

4 Sep, 2021 00:49 IST|Sakshi

నైరుతి సీజన్‌ సగటును దాటిన వర్షపాతం 

చురుగ్గా సాగుతున్న రుతుపవనాలు... పక్షం రోజుల్లో మరిన్ని వర్షాలు 

రెండు జిల్లాల్లో అత్యధికం, 21 జిల్లాల్లో అధికం, 10 జిల్లాల్లో సాధారణం 

గతేడాది సాధారణం కంటే 50 శాతం అధిక వర్షాలు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జోరు వానలు నమోదవుతున్నాయి. సీజన్‌ మొదటి నుంచీ రాష్ట్రవ్యాప్తంగా సంతృప్తికర వర్షాలే కురుస్తున్నాయి. ప్రస్తుత నైరుతి సీజన్‌లో రాష్ట్రంలో ఇప్పటివరకు 60.7 సెంటీమీటర్ల సగటు వర్ష పాతం నమోదు కావాల్సి ఉండగా... శుక్రవారం ఉదయం వరకు 75.54 సెం.మీ. నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటివరకు సాధారణం కంటే 24 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

నైరుతి సీజన్‌లో రాష్ట్ర సగటు వర్షపాతం 72.05 సెం.మీ... కానీ ఇప్పటికే సీజన్‌ సగటు వర్షపాతానికి మించిన వాన లు నమోదు కావడం విశేషం. గత రెండ్రోజులుగా రాష్ట్రం లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుకుగా సాగుతున్నట్లు అధికారులు చెప్పారు. రానున్న పక్షం రోజుల్లో వర్షాలు మరింత విస్తారంగా కురిసే అవకాశం ఉందన్నారు. 

24 జిల్లాల్లో అధిక వర్షాలు 
సీజన్‌ మొదటి నుంచీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు ఒకేతీరుగా నమోదవుతున్నాయి. వానాకాలంలో ఇప్పటివరకు ఎక్కడా లోటు వర్షపాతం నమోదు కాలేదు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సంతృప్తికరమైన వర్షాలు నమోదయ్యాయి. రెండు జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురవగా, 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 

గత నెలలో మందకొడిగా... 
జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకు కాలాన్ని నైరుతి సీజన్‌గా పరిగణిస్తారు. జూన్‌ 3న రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అప్పట్నుంచి రుతుపవనాలు చురుకుగా కదిలినప్పటికీ ఆగస్టులో మాత్రం కాస్త మందకొడిగా సాగాయి. జూన్, జూలైల్లో సాధారణానికి మించి వర్షాలు కురవగా... ఆగస్టులో మాత్రం తక్కువ వర్షపాతం నమోదైంది. ఆ నెలలో 21.9 సెం.మీ. సగటు వర్షపాతానికిగాను 18.6 సెం.మీ. మాత్రమే నమోదైంది. దక్షిణాది జిల్లాల్లో అతి తక్కువగా వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తమ్మీద గతేడాది సాధారణం కంటే 50 శాతం అధిక వర్షాలు నమోదయ్యాయి.

భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం 
భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. హైదరాబాద్‌లో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు అనేక కాలనీలు నీళ్లలోనే ఉన్నాయి. కొన్నిచోట్ల నడుం ఎత్తు వరకు నీళ్లున్నాయి. దీంతో బయటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి. నిత్యావసరాలకు సైతం ఇబ్బందులు పడుతున్నారు. అనేక అపార్టుమెంట్ల సెల్లార్లలోకి వరద నీరు వచ్చిచేరడంతో అక్కడివారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

మోటార్లతో నీటిని తోడేసుకుంటున్నారు. సెల్లార్లు జలమయం కావడంతో లిఫ్టులు ఆపేశారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పాత ఇళ్లు, గోడలు కూలిపోయాయి. గతంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లు కూల్చివేయాలని అధికారులు చెప్పినా కొందరు యజమానులు పెడచెవిన పెట్టడంతో ఈ పరిస్థితి వచ్చింది.  

నీటమునిగిన పంట: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు భారీ వర్షాలకు నీట మునిగాయి. గత నెలలో కురిసిన వర్షాలకు 5 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతినగా తాజాగా మరో లక్ష ఎకరాల్లో నష్టం జరిగినట్లు సమాచారం. ఇప్పుడు 60వేల ఎకరాల్లో పత్తి పంట మునిగిపోగా, 20 వేల ఎకరాల్లో వరి, మరో 20 వేల ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నట్లు అనధికారిక అంచనాలు ఉన్నాయి. పంట నష్టంపై అంచనాలు వేయమని సర్కారు ఆదేశించక పోవడంతో వ్యవసాయశాఖ కనీసం పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

అత్యధిక వర్షపాతం: సిద్దిపేట, నారాయణపేట్‌ 
అధిక వర్షపాతం: ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫా బాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నల్లగొండ, ఖమ్మం 
సాధారణం: మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ములుగు.

మరిన్ని వార్తలు