భాగ్యనగర చరిత్రకు చెదలు.. పట్టించుకోని అధికారులు

5 Aug, 2021 08:04 IST|Sakshi

సాక్షి, చార్మినార్‌( హైదరాబాద్‌): పాతబస్తీలోని హెరిటేజ్‌ కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఏళ్ల తరబడి ఎలాంటి మరమ్మతులకు నోచుకోవడం లేదు. పురాతన కట్టడాల పరిరక్షణను సంబందిత అధికారులు పట్టించుకోవడం లేదని పాతబస్తీ ప్రజలంటున్నారు. 
► గతేడాది జోరుగా కురిసిన భారీ వర్షాలకు నిజాం పాలకుల నివాస గృహమైన చౌమహల్లా ప్యాలెస్‌ ప్రహరీ గోడ కిటికి కూలిపోయింది. 
►అసఫ్‌ జాహీల రాచరిక పాలనకు పాతబస్తీలోని చౌమహల్లా ప్యాలెస్‌ నిలువుటద్దంగా నిలుస్తుంది.  
► అలాగే ఆరో నిజాం మహబూబ్‌ అలీ పాషా సతీమణి సర్దార్‌ బేగం చార్మినార్‌లోని సర్దార్‌ మహాల్‌ భవనంలో నివాసముండేది. 
► నిజాం కాలం నుంచి అందుబాటులో ఉన్న ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. 
► శాలిబండలోని క్లాక్‌ టవర్, సిటీ కాలేజీ భవనాలు ఏళ్ల తరబడి ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. 
►శాలిబండ క్లాక్‌ టవర్‌ను అనుకొని ప్రైవేట్‌ వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి.  
► దీని మరమ్మతు పనులు గతంలో ప్రారంభమైనప్పటికీ..నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. 
► సిటీ కాలేజీ భవనం కప్పు పూర్తిగా శిథిలాస్థకు చేరుకోవడంతో వర్షా కాలంలో వరద నీరు గదుల్లోకి చేరుకుంటోందని సంబంధిత అధికారులు,విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఏడాది గడిచిపోయినా మరమ్మతులకు నోచుకోని చౌమహల్లా ప్యాలెస్‌.... 
యూరోఫియన్‌ శైలిలో నిర్మించిన శ్వేతసౌథం చౌమహల్లా ప్యాలెస్‌లోగతేడాది జూన్‌ 27న కిల్వత్‌ క్రీడా మైదానం వైపు ఉన్న ప్రహరీ పైభాగంలోని కిటికి దిమ్మె కూలి కింద పడింది. మరమ్మతు పనుల కోసం ఏర్పాటు చేసిన సపోర్టుగా ఇనుప రాడ్లు తప్ప.. ఎలాంటి మరమ్మతు పనులు ప్రారంభం కాలేదు. ఆనాటి హెరిటేజ్‌ కట్టడానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా వెంటనే మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ..ఆ దిశలో పనులు జరగడం లేదు.  
నిజాం ప్రభువుల నివాస గృహం.. 
నిజాం ప్రభువుల నివాస గృహంగా ఉండేది.  
► దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు. 
► ఆనాటి కాలంలో విద్యుత్‌ లైట్లు లేని కారణంగా ప్యాలెస్‌లో వెలుగుల కోసం షాండిలియర్లను ఏర్పాటుచేశారు.  
► వీటిలో పొగరాని కొవ్వత్తులు, మైనపు ఒత్తులు ఏర్పాటుచేసేవారు. 
►ప్రస్తుతం విద్యుత్‌ దీపాలు ఉండడంతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్‌కు మరింత శోభను తీసుకువస్తున్నాయి. 
►1915లో చౌమహల్లా ప్యాలెస్‌ ప్రధాన గేట్‌ వద్ద అతిపెద్ద గడియారం ఏర్పాటు చేశారు. 
► విదేశాల నుంచి వచ్చే అతిథులందరికీ చౌమహల్లా ప్యాలెస్‌లో ఆతిథ్య మిచ్చేవారు. 

శిథిలావస్థకు చేరిన సర్దార్‌ మహల్‌... 
జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోన్‌ (సర్దార్‌ మహల్‌) భవన సముదాయం శిథి శిథిలావస్థకు చేరింది. శిథిలావస్థకు చేరిన ఈ భవనానికి మరమ్మత్తులు చేయడం లేదు. భవనంలోని నిజాం కాలం నాటి చెక్క మెట్లు విరిగిపోయాయి. ప్రస్తుతం ఈ విరిగిపోయిన మెట్లపై నుంచే ప్రజలు, సిబ్బంది రాకపోకలు సాగిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ వెళుతున్నారు.   

మరిన్ని వార్తలు