జీ+2 పర్మిషన్‌ తీసుకుని.. అయిదారు అంతస్తులు వేసారా?

22 Feb, 2022 19:05 IST|Sakshi

ఆయా స్థలాల్లో అక్రమ నిర్మాణాలపై తనిఖీలు

600 గజాల కంటే తక్కువ విస్తీర్ణం కట్టడాలే లక్ష్యం

హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో పరిశీలన

వీటి సంఖ్య వేలల్లో ఉంటుందని అంచనా

భవనాల కూల్చివేతపై త్వరలో కార్యాచరణ

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటి వరకు ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టిన భారీ అక్రమ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించిన హెచ్‌ఎండీఏ తాజాగా తక్కువ విస్తీర్ణంలోని అక్రమ భవనాలపై దృష్టి సారించింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో, అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, నగరపంచాయతీలలో అక్రమ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టింది. వివిధ జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగాలు, మున్సిపల్‌ అధికారులు, పోలీసులు తదితర విభాగాలకు చెందిన ప్రత్యేక బృందాలతో త్వరలోనే విస్తృత స్థాయిలో దాడులు చేపట్టనున్నారు. పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించనున్నారు. గత నెల 17 నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగించారు. నగర శివార్లలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 202 అక్రమ భవనాలను గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. 

చట్టవిరుద్ధమని తెలిసినా.. 
గ్రామ పంచాయతీలలో జీ+2 కోసం అనుమతులు తీసుకొన్న భవన యజమానులు నిబంధనలకు విరుద్ధంగా అయిదారు అంతస్తుల భవనాలను నిర్మించారు. హెచ్‌ఎండీఏ  ఇప్పటి వరకు చేపట్టిన కూల్చివేతలలో చాలా వరకు 600 నుంచి1000 గజాల విస్తీర్ణం కలిగిన స్థలాలు. ఇక నుంచి 600 చదరపు గజాల లోపు స్థలాల్లోనూ చేపట్టిన అక్రమ నిర్మాణాలే టార్గెట్‌గా దాడులు కొనసాగించనున్నారు. 150 గజాల నుంచి  250  గజాల వరకు ఉన్న స్థలాల్లో కూడా చాలా చోట్ల  బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం చేపట్టారు. ఇలాంటివి పూర్తిగా చట్టవిరుద్ధం. (క్లిక్‌: ఫ్లాట్‌ కొంటున్నారా? ఏం చేస్తే బెటర్‌!)

అక్రమాలు వేల సంఖ్యలో..  
నగర శివారు ప్రాంతాల్లో వేలాది అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వీటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం పారదర్శకమైన అనుమతులను అందుబాటులోకి తెచ్చింది. చాలామంది నిర్మాణదారులు నిబంధనలను ఉల్లంఘించి గ్రామపంచాయతీల అనుమతులతోనే బహుళ అంతస్తులు చేపట్టారు. కోవిడ్‌ కాలంలో ఇలాంటి అక్రమ భవనాలను  ఎక్కువగా నిర్మించినట్లు  అధికారులు అంచనా వేశారు. తక్కువ విస్తీర్ణంలో చేపట్టిన అక్రమ కట్టడాలు వేల సంఖ్యలో ఉంటాయని అంచనా.  

కొరవడిన నిఘా... 
హెచ్‌ఎండీఏ ఇప్పటి వరకు చేపట్టిన కూల్చివేతల్లో తిరిగి అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కూల్చిన కట్టడాలను ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, ఎమ్మెల్యేల అండతో తిరిగి నిర్మిస్తున్నారు. నిజాంపేట్, తుర్కయంజాల్, పోచారం, ఘట్కేసర్, అన్నోజీగూడ తదితర చోట్ల ఇలా పునర్‌నిర్మించి  కొనుగోలుదారులకు అప్పగించారు. (క్లిక్‌: హైదరాబాదీలకు శుభవార్త! నగరంలో బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లు)

మరిన్ని వార్తలు