TS: ప్రజాపాలన-అభయహస్తం.. దరఖాస్తులు ఎన్ని వచ్చాయంటే?

7 Jan, 2024 08:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-అభయహస్తం కార్యక్రమం ముగిసింది. ఇక, ఆరు గ్యారంటీల కోసం ప్రజలకు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. మహాలక్ష్మి, పెన్షన్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా కోటి 25లక్షల 84వేల 383వందల దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. 

అయితే, డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు పది రోజుల పాటు ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో కాంగ్రెస్ మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే సిలిండర్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఒక్కో మహిళకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.10 లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా, రూ.5 లక్షల యువ వికాసం, రూ.4 వేల పెన్షన్, రేషన్‌ కార్డులు, రైతు భరోసాలాంటి హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీని ప్రారంభించింది. ఆ తర్వాత ప్రజాపాలనలో భాగంగా ఐదు గ్యారెంటీలకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

కాగా, గ్యారంటీలకుగానూ నిన్న ఒక్కరోజే 12లక్షల 53వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇతర దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా 24లక్షలు వచ్చినట్టు తెలిపారు. మహాలక్ష్మి, పెన్షన్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో 650 కేంద్రాల్లో దరఖాస్తులను స్వీకరించారు. ఇక ఈ దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీ జనవరి 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనుంది. 

>
మరిన్ని వార్తలు