కార్యదర్శిపై మంత్రి పొన్నం ఆగ్రహం! ఎంపీడీవోకు ఆదేశాలు

7 Jan, 2024 10:56 IST|Sakshi

'ప్రజాపాలన దరఖాస్తు' చించేసిన బొమ్మనపల్లి జీపీ కార్యదర్శి

చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకు ఆదేశాలు

క‌రీంన‌గ‌ర్: ప్రజాపాలన దరఖాస్తును చించేసిన పంచాయతీ కార్యదర్శిపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. చిగురుమామిడికి చేరుకున్న మంత్రి సర్దార్‌సర్వాయిపాపన్న, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసినివాళులు అర్పించారు. మండలంలోని 17 గ్రామాల ముఖ్య కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. బొమ్మనపల్లి గ్రామ ముఖ్యకార్యకర్తల సమావేశంలో అల్లెపు కనకయ్య తన ఆవేదనను మంత్రికి చెప్పుకున్నాడు.

ప్రజాపాలనలో రెండుసార్లు దరఖాస్తు చేసుకోగా జీపీ కార్యదర్శి రమణారెడ్డి దరఖాస్తు చించేశాడని, బొమ్మనపల్లి గ్రామం కాదని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అన్నాడని చెప్పాడు. మంత్రి వెంటనే జీపీ కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడారు. దరఖాస్తును ఎందుకు చించావని, ప్రజలకు సేవచేయాల్సిందిపోయి ఇలాంటి పనులేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే సస్పెండ్‌ చేస్తామని, కనకయ్య ఇంటికెళ్లి దరఖాస్తు స్వీకరించాలని ఆదేశించారు.

అంతటితో ఆగకుండా మండలపరిషత్‌ అభివృద్ధి అధికారి ఎం. నర్సయ్యకు ఫోన్‌ చేసి తక్షణమే పంచాయతీ కార్యదర్శికి మెమో జారీ చేయాలని ఆదేశించారు. ప్రజలకు మేమే సేవకులమైనప్పుడు, ఉద్యోగులు కూడా సేవకులే అని అన్నారు.  గ్రామాల్లో తప్పనిసరి పర్యటిస్తానని, అత్యవసరాలు తన దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, జెడ్పీఫ్లోర్‌ లీడర్‌ గీకురు రవీందర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రవీందర్, అధికార ప్రతినిధులు దాసరి ప్రవీణ్‌కుమార్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు అధిసంఖ్యలో హాజరయ్యారు.

ఇవి చ‌ద‌వండి: గత పాలనలో ధనిక రాష్ట్రం అప్పులపాలు

>
మరిన్ని వార్తలు