కొడుకు పుడితేనే మా ఇంటికి రా..!.. భర్త, అత్త వేధింపులు

3 Oct, 2021 09:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఖరాఖండిగా చెప్పిన భర్త, అత్త  

వేధింపులు భరించలేక గర్భిణి ఆత్మహత్య 

బహదూర్‌పురా: గర్భంలో ఆడపిల్ల ఉంటే ఆబార్షన్‌ చేయించుకో.. మగపిల్లవాడు పుడితేనే ఇంటికి రా.. అని భర్త, అత్త ఖరాఖండిగా చెప్పడంతో నాలుగు నెలల గర్భిణీ మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. ఓ మహిళ తన కూతురును ఈ ప్రపంచంలోకి రానివ్వడం లేదని ఈ లోకం విడిచి వెళ్లింది. భర్త, అత్తింటి వారి వేధింపులు భరించలేక శనివారం బలవన్మరణం పొందింది.

కామాటిపురా ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు తెలిపిన మేరకు.. మోయిన్‌పురా ప్రాంతానికి చెందిన మీనాజ్‌ బేగం కూతురు రుబీనా బేగం (23).. ముర్గీచౌక్‌ ప్రాంతానికి చెందిన అమేర్‌ను మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. భర్త, అత్తింటి వారు అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించేవారు. రుబీనా బేగం నాలుగు నెలల గర్భవతి కావడంతో ఇటీవల పుట్టింటికి పంపించారు. మళ్లీ ఆడ పిల్ల పుడితే మా ఇంటికి రావద్దంటూ భర్త, అత్త ఖరాఖండిగా చెప్పారు. మీ సామగ్రిని పంపిస్తామని తేల్చి చెప్పారు. గర్భంలో ఆడ పిల్ల ఉంటే ఆబార్షన్‌ చేయించుకో... మగ పిల్లవాడు ఉంటేనే ఇక్కడికి రావాలంటూ హుకుం జారీ చేశారు.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రుబీనా బేగం శనివారం ఉదయం మొదటి అంతస్తులో ఉన్న ఇంట్లోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పైకి వెళ్లిన కూతురు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి మీనాజ్‌ బేగం తలుపులు పగలగొట్టి చూడగా... ఉరేసుకొని కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వవడంతో మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మీనాజ్‌బేగం ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.    
(చదవండి: వేటగాళ్ల ఉచ్చుకు పులి బలి!)

మరిన్ని వార్తలు