‘30 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు’

1 Jan, 2021 12:53 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

సాక్షి, హైదరాబాద్‌:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ శుక్రవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో కలిసి గవర్నర్‌ వద్దకు వెళ్లిన బండి సంజయ్‌.. జీహెచ్‌ఎంసీ నూతన కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని తమిళిసైను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజా నిర్ణయాన్ని ప్రభుత్వం అవమానిస్తోందన్నారు. తమ లైన్‌ క్లియర్‌గా ఉందని, ఇతర పార్టీలతో సంబంధాలు లేవని స్పష్టం చేశారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి విషయం అతన్నే అడిగి చెప్తానన్న సంజయ్‌ 30 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించవద్దని ఆగుతున్నామని,  గెలిచిన టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు కూడా బీజేపీలోకి వస్తామని అంటున్నారన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కొత్త కౌన్సిల్ ఏర్పాటుకు ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతుందని విమర్శించారు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని,  బల్దియా ఎన్నిక జరిగి నెల గడిచినా ఇంకా గెజిట్ ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఎంఐఎం సహకారం లేకుంటే హైదరాబార్‌లో టీఆర్‌ఎస్‌ ఇన్ని సీట్లు కూడా గెలిచేది కాదని, ముందస్తుగా ఎన్నికలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. మేయర్ ఎన్నిక ఎందుకు నిర్వహించడం లేదని నిలదీశారు.  లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్ ప్రమాణ స్వీకారం చేయకుండా మృతి చెందారని, గెలిచిన బీజేపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. 

Poll
Loading...
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు