తెలంగాణ ఏర్పాటయ్యాక వచ్చిన రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎన్ని వేల కోట్లో తెలుసా!

14 Feb, 2023 03:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటైన ఏడాదిలో..అంటే ఎనిమిదేళ్ల క్రితం ప్రభుత్వానికి వచ్చిన రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2,707 కోట్లు. కానీ ఈ ఏడాది జనవరి వరకు..ఏకంగా రూ.12,000 కోట్లు సమకూరింది. రాష్ట్రంలో రోజురోజుకూ విస్తృతమవుతున్న రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు, వ్యవసాయ భూముల క్రయ విక్రయాల నేపథ్యంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత బాగా ఊపందుకున్న రిజిస్ట్రేషన్‌ లావాదేవీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సవరించిన భూముల మార్కెట్‌ విలువలు, పెంచిన స్టాంప్‌ డ్యూటీ కారణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఖజానా కళకళలాడుతోంది.

2021–22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 19.88 లక్షల లావాదేవీలు జరగ్గా, రూ.12 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో జనవరి 31 నాటికి 16.03 లక్షల లావాదేవీలు జరగ్గా, రూ.11,928 కోట్ల ఆదా యం సమకూరినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.8,600 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది లావాదేవీల సంఖ్య, ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇక తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలి ఏడాది (2014–15)లో 8.26 లక్షల లావాదేవీలు జరిగి కేవలం రూ.2,707 కోట్ల ఆదాయం మాత్రమే ఖజానాకు రావడం గమనార్హం. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జరిగిన భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటివరకు రూ.60 వేల కోట్ల వరకు రెవెన్యూ వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి.  

హైదరాబాద్‌ చుట్టూనే.. 
భూములు, ఆస్తుల క్రయ విక్రయ లావాదేవీలు చాలావరకు హైదరాబాద్‌ చుట్టూనే జరుగుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో మెజార్టీ లావాదేవీలు జరుగుతుండగా, హనుమకొండ, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేటల్లో కూడా భారీగానే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ చుట్టు పక్కల జిల్లాల్లో 10 నెలల్లో 50 వేల వరకు లావాదేవీలు జరగ్గా, మిగిలిన జిల్లాల్లో 30 వేలకు పైగా లావాదేవీలు జరిగాయి. అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయేతర భూముల విలువలను బట్టి ఆదాయం సమకూరుతోంది. ఇక రాష్ట్రంలో అతి తక్కువ రిజి్రస్టేషన్లు ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వరంగల్, నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో జరుగుతున్నాయి. ఈ జిల్లాల్లో నెలకు సగటున వెయ్యి లోపు లావాదేవీలే జరుగుతుండడం గమనార్హం .  

ధరణి పోర్టల్‌కు 10.23 కోట్ల హిట్లు
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం 2020 నవంబర్‌ 2 నుంచి అమల్లోకి వచి్చన ధరణి పోర్టల్‌కు ఇప్పటివరకు 10.23 కోట్ల హిట్లు వచి్చనట్టు (వీక్షించినట్లు) ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పోర్టల్‌ ద్వారా ఇప్పటివరకు 29.67 కోట్ల భూముల రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు జరిగాయని, తద్వారా రూ.4,741.65 కోట్ల ఆదాయం సమకూరిందని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వెల్లడించింది.

మరిన్ని వార్తలు