కౌన్సెలింగ్‌కు ముందే కాలేజీల్లో తనిఖీలు

18 Mar, 2022 04:10 IST|Sakshi

సైన్స్‌ కోర్సులపై ప్రత్యేక దృష్టి 

మౌలిక వసతులుంటేనే గుర్తింపు 

జేఎన్‌టీయూలో ప్రత్యేక కమిటీ ఆలోచన 

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు ముందే ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తనిఖీలు చేపట్టాలని హైదరాబాద్‌ జేఎన్‌టీయూ యోచిస్తోంది. తనిఖీల కోసం ఈ ఏడాది కూడా అనుభవజ్ఞులతో కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు అవసరం. గుర్తింపు ఇవ్వాలంటే విశ్వవిద్యాలయం అధికారులు కాలేజీల్లోని వసతులను పరిశీలించాల్సి ఉంటుంది.

గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో ఈ ప్రక్రియ సజావుగా సాగలేదు., మౌలిక వసతులు లేని కాలేజీలను గుర్తించినా, ఆఖరి నిమిషంలో అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. ఈసారి మాత్రం ఈ అవకాశం ఇవ్వబోమని జేఎన్‌టీయూహెచ్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  

కంప్యూటర్‌ సైన్స్‌పై గురి 
గత కొన్నాళ్లుగా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతోంది. గతేడాది కంప్యూటర్‌ సైన్స్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ వంటి కొత్త కోర్సుల్లో దాదాపు 5 వేల సీట్లు పెరిగాయి. మెకానికల్, సివిల్‌లో సీట్లు తగ్గించుకుని కొత్త కోర్సులకు అనుమతులు పొందాయి. అయితే, చాలా కాలేజీల్లో కంప్యూటర్‌ కోర్సుల బోధన ఆశించినస్థాయిలో లేదని జేఎన్‌టీయూహెచ్‌ గుర్తించింది అత్యున్నత ప్రమాణాలున్న ఫ్యాకల్టీ లేదని, లోతుగా అధ్యయనం జరగడంలేదనే నిర్ణయానికి వచ్చింది.

అధ్యాపకుల అటెండెన్స్‌ కోసం తీసుకొచ్చిన బయోమెట్రిక్‌ కూడా సరిగా అమలవ్వడంలేదనే ఆరోపణలున్నాయి. అధికారిక లెక్కల్లో ఫ్యాకల్టీ ఒకరు ఉంటే, వాస్తవంగా బోధించేది వేరొకరనే విమర్శలు వస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు అధ్యాపకుల పాన్‌ నంబర్‌ ఆధారంగానూ వాస్తవాలు తెలుసుకుంటామని జేఎన్‌టీయూహెచ్‌ తెలిపింది. కానీ ఇది ఆచరణ సాధ్యం కాలేదు. ఇలాంటి సమస్యలన్నీ ఈసారి పరిష్కరించే దిశగా కృషి చేయాలని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మౌలిక వసతులు, కంప్యూటర్‌ కోర్సుల్లో సరైన ఫ్యాకల్టీ లేని కాలేజీలకు ముందుగా నోటీసులు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు.  

కౌన్సెలింగ్‌కు ముందే.. 
జేఈఈ మెయిన్స్, ఇంటర్‌ పరీక్షల తేదీల్లో మార్పు కారణంగా ఈసారి ఎంసెట్‌ పరీక్ష కూడా ఆలస్యమయ్యే అవకాశం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ సెప్టెంబర్‌ వరకూ కొనసాగే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాలేజీల తనిఖీలు కౌన్సెలింగ్‌కు ముందే చేపట్టి, వాస్తవ నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. అనుబంధ గుర్తింపు లభించిన కాలేజీలనే కౌన్సెలింగ్‌కు అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు మండలి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  

మరిన్ని వార్తలు