అది అవినీతి సొమ్ము కాదు..నా సొంత డబ్బులే ఇచ్చా

27 Aug, 2021 08:43 IST|Sakshi
మాట్లాడుతున్న సర్పంచ్‌ కృష్ట

పండుగ సందర్భంగా నా సొంత డబ్బులు ఇచ్చా..

వైరల్‌ అయిన వీడియోపై కిష్టారెడ్డిపేట సర్పంచ్‌ కృష్ణ వివరణ

సాక్షి,పటాన్‌చెరు(హైదరాబాద్‌): ‘పంచాయతీలో సీసీ కెమెరాలు ఉంటాయని మాకు తెలియదా? పంచాయతీ హాలులో సభ్యులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున నా సొంత డబ్బులను ఇచ్చాను. అది కూడా హోలీ పండుగ సందర్భంగా ఇచ్చా.’ అని సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఫుటేజీపై సర్పంచ్‌ ఏర్పుల కృష్ణ వివరణ ఇచ్చారు. గురువారం ఆయన ఉపసర్పంచ్‌ ఫయీమ్‌తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

అయితే ఆ సొమ్ము ఏ బిల్డర్‌ దగ్గర తెచ్చింది కాదు. ఓ వార్డు సభ్యుడు అక్రమంగా ఏడంతుస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడని, ఆ భవంతిని కూల్చివేసిన కారణంగానే అసత్య ఆరోపణలు చేస్తున్నారని కృష్ణ తెలిపారు. పంచాయతీ సీసీ కెమెరా ఫూటేజీని దొంగలించి తమపై లేనిపోనివి కల్పించి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలో సీసీ కెమెరాలున్న సంగతి మాకు తెలియంది కాదన్నారు. సీసీ కెమెరాలను ఊరంతా పెట్టించానని, అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయంలోనూ తామే పెట్టించినట్లు సర్పంచ్‌ కృష్ణ, ఉపసర్పంచ్‌ ఫయీమ్‌ వివరించారు. తాము ఏ తప్పు చేయలేదని, పంచాయతీ కార్యాలయంలో ఇచ్చిన డబ్బు అవినీతి సొమ్ము కాదని తెలిపారు. తనపై అనవసర దుష్ప్రచారానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 

చదవండి: వివాహేతర సంబంధం వద్దన్నందుకు..

మరిన్ని వార్తలు