పదవి కాపాడుకునేందుకు మేయర్‌ పడరాని పాట్లు!

5 Jul, 2022 08:42 IST|Sakshi

 కార్పొరేటర్లకు మేయర్‌ డబ్బుల ఎర! 

నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అసమ్మతి లొల్లి 

గుబులు పుట్టిస్తున్న క్యాంప్‌ రాజకీయాలు 

అదేమీ లేదంటున్న మేయర్‌ భర్త  

కుత్బుల్లాపూర్‌: శివారు ప్రాంత రాజకీయం రసవత్తరంగా మారుతుంది.. ఇప్పటికే నగరం నగర శివారు ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలు.. నగర పంచాయతిలలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పార్టీలు మారుతూ తమ అధిష్టానానికి ఝలక్‌ ఇస్తున్న నేపథ్యంలో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. అధికార టిఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు క్యాంపు రాజకీయాలకు ఆస్కారం ఇవ్వడంతో మేయర్‌ ఒక మెట్టు దిగి ప్రతి ఒక కార్పొరేటర్‌కు ఎంతో కొంత ముట్టజెప్పే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

►    కాగా నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు 2019 జనవరి నెలలో జరిగాయి. ఈ ప్రాంతంలో మొత్తం 27 మంది అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారు గెలుపొందగా ఆరు గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. అయితే మెజారిటీ సభ్యులు ఉన్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ లో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ రాజులు కలిసి కొలను నీలా గోపాల్‌రెడ్డిని మేయర్‌గా, డిప్యూటీ మేయర్‌ ధనరాజ్‌యాదవ్‌లను ఎంపిక చేశారు. అంతవరకు బాగానే ఉంది రెండేళ్లపాటు సాఫీగా సాగిన వీరి ప్రయాణం మూడవ సంవత్సరం దగ్గరపడుతున్న కొద్దీ టెన్షన్‌ మొదలైంది.  

క్యాంపు రాజకీయాలకు... 
►     మొత్తం 27 మంది కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారు కాగా వారిలో ఏకంగా 17 మంది స్థానిక టీఆర్‌ఎస్‌ నేతతో గత నెలలో శ్రీశైలం టూర్‌ కి వెళ్లి క్యాంప్‌ రాజకీయాలకు తెరలేపారు. దీంతో ఏదో జరిగిపోతుందన్న ఆందోళనతో మేయర్‌ భర్త గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ రాజు, ఎమ్మెల్యే వివేకానందలకు ఈ విషయా న్ని చేరవేశారు. క్యాంపులో ఉన్న 17 మందితో పాటు మరో ముగ్గురు కార్పొరేటర్లు జత కలవడంతో వారి సంఖ్య ఏకంగా 20 కి చేరింది. దీంతో ‘రాజీ’ఫార్ములాకు వచ్చిన మేయర్‌ భర్త ఒ క్కొక్కరికి ఇంత చొప్పున ఇస్తానని హామీ ఇచ్చి ఊపిరి పీల్చుకున్నాడు. అయితే సమయానికి డబ్బులు ఇవ్వకపోవడంతో మరోసారి ఆ నో టా.. ఈ నోటా ఈ ఒప్పందం విషయం బహిర్గతం కావడంతో ఆయా పార్టీల నాయకులు ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా స్వతంత్రంగా గెలిచిన ఆరుగురు కార్పొరేటర్లు ఈ విషయంలో తటస్థంగా ఉండడం విశేషం. 

గిట్టని వాళ్ల పని ఇది... 
►     ఈ విషయంపై నిజాంపేట మేయర్‌ భర్త గోపాల్‌ రెడ్డిని వివరణ కోరగా ఖండించారు. కొంతమంది గిట్టనివాళ్లు ఇలా చెప్పుకుంటున్నారని, తాను ఎందుకు డబ్బులు ఇస్తానని ప్రశ్నించారు. అదంతా అబద్ధపు ప్రచారమని, తాను ఎవరికీ డబ్బులు ఇస్తానని చెప్పలేదు అంటూ వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు