రైల్వే ఉన్నతాధికారి బంధువునంటూ బిల్డప్‌.. అసలు విషయం తెలిశాక అరెస్టు

12 Jul, 2022 09:35 IST|Sakshi

చెన్నై రైల్వే స్టేషన్‌లో హైదరాబాదీ హల్‌చల్‌ 

రైల్వే ఉన్నతాధికారి బంధువునంటూ హంగామా

ఆరా తీసిన జీఆర్పీ పోలీసులు

అసలు విషయం గుర్తించి అరెస్టు

సాక్షి, సిటీబ్యూరో: నగరం నుంచి తన వ్యాపార పనులపై చెన్నై వెళ్లిన ఉదయ్‌ భాస్కర్‌ అక్కడి రైల్వే స్టేషన్‌లో హడావుడి చేశాడు. తాను ప్రయాణించాల్సిన రైలు ఆలస్యం కావడంతో ఆ సమయంలో  ‘అధిక మర్యాదలు’ డిమాండ్‌ చేశాడు. దీనికోసం తాను రైల్వే ఉన్నాధికారి బంధువునంటూ బిల్డప్‌ ఇచ్చాడు. ఆరా తీసిన జీఆర్పీ పోలీసులు అసలు విషయం తెలుసుకుని రైల్లో ప్రయాణిస్తున్న భాస్కర్‌ను కట్పాడిలో అరెస్టు చేసి వెనక్కు తీసుకెళ్లారు. శనివారం చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన ఉదయ్‌ భాస్కర్‌ అల్యూమినియం వ్యాపారి. వ్యాపార పనుల నిమిత్తం తరచు చెన్నై వెళ్లి వస్తుండేవాడు. ఇటీవల చెన్నై అతను శుక్రవారం రాత్రి నగరానికి తిరిగి వచ్చేందుకు చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్‌ రిజర్వేషన్‌ చేయించుకున్నాడు.  అయితే ఆ రైలు నిర్దేశిత సమయం కన్నా ఆలస్యంగా బయలుదేరుతున్నట్లు భాస్కర్‌ తెలుసుకున్నాడు. దీంతో ఆ సమయం వరకు వేచి ఉండటానికి వెయిటింగ్‌ హాల్‌ వద్దకు వెళ్లారు. అది అప్పటికే నిండిపోవడంతో సమీపంలో ఉన్న వీఐపీ లాంజ్‌పై అతడి కన్ను పడింది. దాంట్లోకి ప్రవేశించేందుకు ఉన్నతాధికారి బంధువు అవతారం ఎత్తాడు. తాను రైల్వే బోర్డు చైర్మన్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అయిన వినయ్‌ కుమార్‌ త్రిపథి సమీప బంధువునంటూ అక్కడి సిబ్బందికి చెప్పాడు. అది నిజమని నమ్మని వీఐపీ లాంజ్‌ ఉద్యోగులు లోపలికి అనుమతించారు.

రైల్వే ఉద్యోగులపై చిందులు..
ఎంతైనా తమ శాఖకు చెందిన ఉన్నతాధికారి బంధువు కదా అనే ఉద్దేశంతో కాస్త మర్యాదపూర్వకంగా నడుచుకున్నారు. దీంతో భాస్కర్‌లో కొత్త ఆలోచనలు పుట్టకువచ్చాయి. తనకు దక్కాల్సినంత గౌరవం దక్కట్లేదని, సరైన ఆహారం, పానీయాలు అందించట్లేదంటూ హంగామా చేశాడు. అక్కడ ఉన్న రైల్వే ఉద్యోగులపై చిందులు తొక్కడంతో పాటు దీనిపై తాను త్రిపథికి ఫిర్యాదు చేస్తానని గద్ధించాడు. తనతో మర్యాదగా నడుచుకోని ప్రతి ఒక్కరినీ ఈశాన్య రాష్ట్రాలకు బదిలీ చేయిస్తానంటూ లేనిపోని హడావుడి చేశాడు. చివరకు తన రైలు ఎక్కి హైదరాబాద్‌కు బయలుదేరాడు.

అయితే ఇతడి ఓవర్‌ యాక్షన్‌ను గమనించిన రైల్వే ఉద్యోగులకు అనుమానం రావండంతో రిజర్వేషన్‌ చార్ట్‌ ఆధారంగా భాస్కర్‌ వివరాలు సేకరించారు. వీటిని రైల్వే బోర్డు చైర్మన్‌ కార్యాలయానికి పంపడం ద్వారా అతడికి, త్రిపథికి ఎలాంటి సంబంధం లేదని తెలుసుకున్నారు. దీంతో వీఐపీ లాంజ్‌ ఉద్యోగులు చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌లోని గవర్నమెంట్‌ రైల్వే పోలీసులకు (జీఆర్పీ) ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న జీఆర్పీ ఆ సమయంలో భాస్కర్‌ ప్రయాణిస్తున్న రైలు కట్పాడి జంక్షన్‌ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి అధికారుల సమాచారం ఇవ్వడం ద్వారా రైల్లో ఉన్న భాస్కర్‌ను దింపించారు. శనివారం ఉదయం కట్పాడి చేరుకున్న జీఆర్పీ బృందం భాస్కర్‌ను అరెస్టు చేసి చెన్నై తీసుకువెళ్లింది. రైల్వే కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించింది.

చదవండి: సైబర్‌ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న వైద్యుడు 

మరిన్ని వార్తలు