Actress Shalu Chourasiya Attacked KBR Park: నటి చౌరాసియాపై దాడి.. మిస్టరీ వీడింది..

20 Nov, 2021 10:30 IST|Sakshi

నిందితుడు సినీ పరిశ్రమలో లైట్‌మెన్‌ 

దొంగిలించిన సెల్‌ఫోన్‌ సిగ్నల్‌తోనే దొరికాడు.. 

నాలుగు రోజులుగా రెక్కీ నిర్వహించి దాడికి పాల్పడినట్లు నిర్ధారణ 

ఇందిరానగర్‌లో నిందితుడి పట్టివేత 

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో సినీ నటిపై దుండగుడి దాడి మిస్టరీని పోలీసులు ఛేదించారు. గత ఆదివారం రాత్రి 8.40 గంటల సమయంలో కేబీఆర్‌ పార్కు వాక్‌వేలో సినీ నటి షాలు చౌరాసియా వాకింగ్‌ చేస్తుండగా దుండగుడు ఆమెపై దాడి చేసి..లైంగికి దాడికి యత్నించి సెల్‌ఫోన్‌ తస్కరించి పరారైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఘటన జరిగిన అయిదు రోజుల్లోనే ఛేదించారు. నిందితుడు తెలుగు చలన చిత్రపరిశ్రమలో లైట్‌మెన్‌గా పని చేస్తున్న కె.బాబు (30)గా గుర్తించి శుక్రవారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని ఇందిరానగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. 

చోరీ చేసిన సెల్‌ఫోనే నిందితుడిని పట్టించడం గమనార్హం. ఆదివారం రాత్రి వాకింగ్‌ చేస్తున్న షాలూ చౌరాసియాపై నిందితుడు దాడి చేసి తీవ్రంగా కొట్టి రూ. 10 వేలు డిమాండ్‌ చేశాడు. ఆమె తన దగ్గర డబ్బులు లేవని పేటీఎం చేస్తానని చెప్పినా వినిపించుకోలేదు. బండరాయి పక్కన కిందకు తోసేసి ఆమెను తీవ్ర ఇబ్బందికి గురి చేశాడు. ఒక సందర్భంలో బండరాయిని ముఖంపై బాది హత్య చేసేందుకు కూడా యత్నించాడు. శక్తిని కూడదీసుకున్న బాధిత నటి తన మోచేతితో దుండుగుడిపై దాడి చేసి ఫెన్సింగ్‌ దూకి బయటికి పరుగులు తీసింది.  

తీవ్రంగా శ్రమించిన పోలీసులు  
ఈ ఘటనను సవాల్‌గా తీసుకున్న వెస్ట్‌ జోన్, నార్త్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్, బంజారాహిల్స్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి అటు సీసీ కెమెరాలతో పాటు ఇటు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ను జల్లెడ పట్టాయి. ఆదివారం రాత్రి 11.40 గంటల ప్రాంతంలో నిందితుడు ఇందిరానగర్‌ ప్రాంతంలో సెల్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసినట్లుగా గుర్తించిన నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆ ఒక్క ఆధారంతో సాంకేతికతను ఉపయోగించి నిందితుడిని పట్టుకున్నారు. కృష్ణానగర్, ఇందిరానగర్‌ మధ్యలో గది అద్దెకు తీసుకొని ఉంటున్న కె.బాబు సినీ పరిశ్రమలో లైట్‌మెన్‌గా పని చేస్తున్నట్లుగా తేలింది. 

నిందితుడు ఆ రోజు వేసుకున్న షర్ట్, ప్యాంట్‌ కలర్‌ ఆధారంగా ఊహా చిత్రాన్ని తయారు చేసిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురు, శుక్రవారాల్లో ఇందిరానగర్, కృష్ణానగర్‌ ప్రాంతాల్లో సినీ కార్మికులు ఉండే ప్రాంతాలను జల్లెడపట్టారు. ఎట్టకేలకు ఆరోజు నిందితుడు వేసుకున్న షర్ట్‌ను గుర్తించిన సహచరులు పోలీసులకు తగిన ఆధారాలు అందజేశారు. దీంతో పోలీసులు నిందితుడి గదిలో ఉండగానే రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెల్‌ఫోన్‌ దొరకడంతో అతడే నిందితుడని నిర్ధారించారు.  

రెక్కీ చేసి.. 
పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు నిందితుడు వెల్లడించినట్లుగా తేలింది. ఘటన జరిగిన నాటికి నాలుగు రోజుల ముందు నుంచే నిందితుడు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు తేలింది. ఆ రోజూ సీసీ కెమెరాలు లేనిచోట, చీకటి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఎవరూ  లేరని నిర్ధారించుకున్నాక అత్యాచార యత్నానికి పాల్పడినట్లుగా తెలిపాడు. దొంగతనానికి రాలేదని, అత్యాచారం చేయడానికే వచ్చినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో నిందితుడు వెల్లడించినట్లు తెలిసింది. మొత్తానికి నిందితుడు పట్టుబడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు