కాకతీయ ఉత్సవాలు అద్భుతం!

8 Jul, 2022 12:34 IST|Sakshi

నాటి పాలన, అభివృద్ధి ఘనతను గుర్తు చేసుకోవడం గర్వంగా ఉంది

ఓరుగల్లు పర్యటనలో కాకతీయుల 22వ వారసుడు కమల్‌ చంద్ర భంజ్‌దేవ్‌

ఇక్కడి ప్రజల ఆదరణ అపూర్వం.. త్వరలో కుటుంబ సమేతంగా వస్తానని వెల్లడి 

కాకతీయులు ఆదర్శంగానే రాష్ట్ర పాలన: శ్రీనివాస్‌గౌడ్‌ 

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ‘‘మా పూర్వీకులు పరిపాలించిన గడ్డ మీదకు రావడం సంతోషంగా ఉంది. 700 ఏళ్ల కిందటి మా వంశస్థుల పరిపాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటూ ఉత్సవాలను నిర్వహించడం గర్వంగా ఉంది. నన్ను ఆహ్వానించిన ప్రభుత్వానికి, నాయకులకు నా ధన్యవాదాలు. ఓరుగల్లు ప్రజలు మా పట్ల చూపిన ఆదరణ అమోఘం. త్వరలో కుటుంబ సమేతంగా వస్తా..’’ అని కాకతీయుల 22వ వారసుడు, బస్తర్‌ రాజు రాజా కమల్‌ చంద్ర భంజ్‌దేవ్‌ సంతోషం వ్యక్తం చేశారు. 


కాకతీయ వైభవ సప్తాహంలో పాల్గొనేందుకు గురువారం వరంగల్‌కు వచ్చిన కమల్‌ చంద్ర భంజ్‌దేవ్‌కు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘జనరంజక పాలన అందించి, ప్రజాసేవకు అంకితమైన పూర్వీకుల స్ఫూర్తితో బస్తర్‌లో సమాజ సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. కాకతీయుల స్ఫూర్తి, ఉత్సాహం ఎల్లప్పుడూ ఉండాలి. అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం సప్తాహం వేడుకలు నిర్వహించడం గర్వంగా ఉంది. దేశ చరిత్రలో ఇదొక మరపురాని రోజు..’’ అని భంజ్‌దేవ్‌ పేర్కొన్నారు. కాకతీయులు రోల్‌ మోడల్‌గా తెలంగాణలో అనేక పథకాలు నడుస్తున్నాయని, మిషన్‌ కాకతీయ పథకం అద్భుతమని కొనియాడారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
 
కాకతీయులు ఆదర్శంగానే పాలన: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌  
కాకతీయుల చరిత్రను భావి తరాలకు తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కాకతీయుల చరిత్రను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని.. వారి వారసుడిని పిలిచి ఉత్సవాలు చేస్తున్నామని చెప్పారు. వరంగల్‌ అంటే కేసీఆర్‌కు ప్రేమ ఎక్కువన్నారు. కాకతీయుల ఆదర్శంతోనే తెలంగాణ ప్రభుత్వం ఆలయాలను, చెరువులను అభివృద్ధి చేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు కాకతీయ ఘన చరిత్రను మరుగునపడేలా చేశాయని, కేసీఆర్‌ పట్టుదలతో నేడు ఆ చరిత్ర ప్రపంచానికి తెలిసిందని పేర్కొన్నారు. ఇక తాను కాకతీయ గడ్డపై పుట్టినందుకు సంతోషంగా ఉందని మంత్రి సత్యవతిరాథోడ్‌ చెప్పారు. కాకతీయుల పాలన ప్రభుత్వాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో రాణించాలని భద్రకాళి అమ్మవారిని వేడుకున్నామన్నారు. 


ఓరుగల్లు కోటలో సప్తాహం షురూ.. 

భద్రకాళి ఆలయంలో పూజల అనంతరం కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌.. రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత వరంగల్‌ కోటను సందర్శించారు. ఈ సందర్భంగా వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుర్రపు బండిపై భంజ్‌దేవ్‌తోపాటు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సత్యవతిరాథోడ్, చీఫ్‌విప్‌ వినయభాస్కర్, ఎమ్మెల్యే నరేందర్‌ ఊరేగారు. వరంగల్‌ కోట, కళా తోరణాలు, సాంస్కృతిక వైభవాన్ని పరిశీలించిన భంజ్‌దేవ్‌ భావోద్వేగానికి గురయ్యారు.

వరంగల్‌ కోటలో బెలూన్లను ఎగురవేసి ‘కాకతీయ వైభవ సప్తాహం’ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం వేయి స్తంభాల గుడిలో అభిషేకం నిర్వహించారు. అగ్గిలయ్య గుట్టను సందర్శించి మొక్కలు నాటారు. అక్కడి నుంచి కాకతీయ హరిత హోటల్‌కు చేరుకుని.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్, సత్యవతి రాథోడ్, వినయభాస్కర్, కలెక్టర్‌లకు బస్తర్‌ పరిపాలన జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు బండా ప్రకాష్, బస్వరాజు సారయ్య, మేయర్‌ గుండు సుధారాణి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. (క్లిక్‌: ఆ ఇద్దరి నేతల మధ్య.. బస్తీ మే సవాల్‌)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు