పంటలు మార్చండి, లాభాలు పొందండి.. రైతులకు సీఎం కేసీఆర్‌ సూచన

3 Dec, 2021 04:44 IST|Sakshi

ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం 

హైదరాబాద్‌కు తిరిగొస్తూ మినుము, వేరుశనగ పంటల పరిశీలన 

రైతులు, వ్యవసాయాధికారులతో మాటామంతీ

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  వరి వంటి ఒకే తరహా పంట వేసి ఇబ్బంది పడే కంటే రైతులు ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. వరికి ప్రత్యామ్నాయమే మేలు అని, తెలంగాణ రైతులు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న వేరుశనగ, మినుములు, పత్తి, పెసర్లు, శనగల వంటి పంటలు సాగు చేయాలని చెప్పారు. పంట మార్పిడి విధానం అవలంబించి అధిక దిగుబడులు, లాభాలు గడించాలన్నారు. గద్వాల ఎమ్మెల్యే బి.కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి ఇటీవల మరణించిన నేప థ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన గురువారం గద్వాలకు వచ్చారు.

రోడ్డు మార్గంలో బస్సులో వచ్చిన సీఎం.. ముందుగా ఎమ్మెల్యే తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరుగుపయనంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్‌ శివారులో 44వ నంబర్‌ జాతీయ రహదారి పక్కన సాగు చేస్తున్న మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. రైతులు, వ్యవసాయాధికారులతో ముచ్చటించారు. అదేవిధంగా కొత్తకోట మండల పరిధిలోని విలియంకొండ తండా రోడ్డు వద్ద కల్లంలో ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు.

అక్కడే రోడ్డు పక్కన పెద్దగూడేనికి చెందిన కౌలు రైతు గోకరి వెంకటయ్య సాగు చేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించారు. కొన్ని వేరుశనగ మొక్కలను భూమి నుంచి తీసి కాయల నాణ్యతను పరిశీలించారు. నీళ్లు, కరెంట్‌ పుష్కలంగా ఉండడంతో పంటల దిగుబడి బాగా పెరిగిందని ముఖ్యమంత్రికి రైతు వెంకటయ్య వివరించారు. ఈ సందర్భంగా మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలని అక్కడే ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి సూచించారు.

ముఖ్యమంత్రి అకస్మాత్తుగా చేలల్లోకి రావడంతో రైతులు, గిరిజనులు ఆయనతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. సీఎం వెంట రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, పట్నం నరేందర్‌రెడ్డి, గువ్వల బాలరాజు తదితరులు ఉన్నారు. 

కాన్వాయ్‌ని అడ్డుకునే యత్నం 
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల కొత్తబస్టాండ్‌ దాటిన తర్వాత జాతీయ రహదారిపై సీఎం కాన్వాయ్‌ని స్థానిక బీజేవైఎం నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించి కాన్వాయ్‌ సాఫీగా ముందుకు వెళ్లేలా చేశారు.  

మినుము రైతుతో సీఎం ముచ్చట 
సీఎం కేసీఆర్‌: మినుము పంట ఎందుకు వేశావు ? 
రైతు మహేశ్వర్‌రెడ్డి: నీళ్లు తక్కువ తీసుకుంటుంది. ఆరు తడి పంటల కింద వేశాను సర్‌. 
సీఎం: ఎన్ని రోజుల్లో చేతికొస్తది ? 
రైతు: 90 రోజుల్లో వస్తది. 
సీఎం: ఎకరాకు ఎంత దిగుబడి వస్తుంది ? 
రైతు: 8 నుంచి 12 క్వింటాళ్ల మధ్య వస్తది. 
సీఎం: పెట్టుబడి ఖర్చు ఎంతవుతది ? 
రైతు: మందులు, ఎరువులు, కూలీలు కలిపి మొత్తం ఖర్చు ఎకరాకు రూ.20 వేలు అవుతది.  
సీఎం: మార్కెట్‌లో ఎంత ధర పలుకుతోంది ? 
రైతు: ఎంఎస్‌పీ క్వింటాల్‌కు రూ.6,300 ఉంది. మార్కెట్‌లో రూ.8 వేలకు పైనే ఉంది సార్‌. 
సీఎం: అమ్మితే మీకు ఎంత మిగుల్తది ? 
రైతు: ఖర్చులు పోనూ రూ.20 వేలు మిగుల్తది.  
సీఎం: ఎక్కడెక్కడ మినుము వేస్తారు? 
రైతు: పెంచికలపాడు, ఈర్లదిన్నె, జనుంపల్లి, గుమ్మడం, యాపర్లలో ఎక్కువగా వేస్తారు సర్‌.  
 

మరిన్ని వార్తలు