సాక్షి ఎఫెక్ట్‌: చిన్నయ్య కుటుంబానికి భరోసా

14 Sep, 2021 09:12 IST|Sakshi

సాక్షి, నెన్నెల(ఆదిలాబాద్‌): మండలంలోని ఖర్జీ జంగాల్‌పేటలో విద్యుత్‌ ప్రమాదంలో రెండు కాళ్లు, ఒక చేతిని కోల్పోయి మంచానికే పరిమితమైన పంగిడి చిన్నయ్య అనే వ్యవసాయ కూలీ దీనస్థితిపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈనెల 12న ‘పేద కుటుంబానికి పెద్ద కష్టం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచూరితమైన కథనాన్ని బెల్లంపల్లికి చెందిన ఎన్‌ఆర్‌ఐ, సైబర్‌ సెక్యూరిటీ ఇంజనీర్‌ తోడ వెంకటకృష్ణారెడ్డి ట్విట్టర్‌లో పోస్టు చేయగా.. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

కేటీఆర్‌ కార్యాలయం నుంచి నెన్నెల కోవిడ్‌ వలంటీర్‌ బృందం వ్యవస్థాపకుడు, ఉపాధ్యాయుడు జలంపల్లి శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి, కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కొద్దిపాటి స్థలాన్ని అమ్మి రూ.3 లక్షల వరకు ఖర్చు చేసి చిన్నయ్య వైద్యం చేసుకున్న ఫలితం లేదని, ముగ్గురు పిల్లలు ఉన్నారని ఇల్లు అంతంత మాత్రంగానే ఉందని శ్రీనివాస్‌ వివరించారు. వైద్యఖర్చులకు సంబంధించిన బిల్లులు తీసుకుని హైదరాబాద్‌ మాసబ్‌ ట్యాంకులోని కేటీఆర్‌ కార్యాలయానికి వచ్చి నేరుగా ఇవ్వాలని వారు కోరారు. మూడు నెలల్లో సీఎం సహాయ నిధి కింద పూర్తి డబ్బులు అందేలా చూస్తామన్నారు.

కేటీఆర్‌ ఆదేశాల మేరకు బాలల పరిరక్షణ కమిటీ జిల్లా అధికారి సత్తయ్య సోమవారం గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబంతో మాట్లాడారు. నెలకు సరిపడా సరుకులను అందజేశారు. విద్యాపరంగా పిల్లలకు 18 ఏళ్లు నిండే వరకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్‌ శాఖ ద్వారా బాధిత కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం అందించేందుకు నివేదికలు సిద్ధం చేసి పంపించనున్నట్లు బెల్లంపల్లి విద్యుత్‌ డీఈ రావుల శ్రీధర్‌ తెలిపారు. ఒప్పంద కార్మికురాలిగా ఉపాధి కల్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటానని బాధితుడి భార్య ముత్తక్క వేడుకుంటోంది.  

స్పందించిన దాతలు.. 
పంగిడి చిన్నయ్య కుటుంబానికి గొల్లపల్లి ఎంపీటీసీ బొమ్మెన హరీష్‌గౌడ్‌ రూ.5 వేలు, నెన్నెల కోవిడ్‌ వలంటీర్స్‌ బృందం తరఫున రూ.2 వేల ఆర్థికసాయం అందజేశారు.   

చదవండి: TS: ఎగుమతులతోనే రైతు ఆదాయం రెట్టింపు

మరిన్ని వార్తలు