‘నేతన్నకు చేయూత’తో కార్మికులకు లబ్ధి 

1 Sep, 2020 03:49 IST|Sakshi
సోమవారం గోల్కొండ షోరూమ్‌లో పెయింటింగ్‌ను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్‌

25 వేల మందికి రూ.110 కోట్ల మేర ప్రయోజనం 

పథకం గడువు ముగియడంతో మరోమారు ప్రవేశపెట్టే యోచన 

హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల్లోనూ టెస్కో షోరూంలు 

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ‘నేతన్నకు చేయూత’పథకం నిబంధనలను సడలించడం ద్వారా నేత కార్మికులకు రూ.110 కోట్ల నిధులు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. కార్మికులకు భారీగా లబ్ధి చేకూరుతుండటంతో ఈ తరహా పథకాలను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం హైదరాబాద్‌ హస్తకళల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

నేతన్నకు చేయూత పథకంలో మూడేళ్ల లాక్‌ఇన్‌ పీరియడ్‌ను తగ్గించడంతో గడువుకు ముందే పొదుపు డబ్బులను తీసుకోవడం సాధ్యమైందన్నారు. ఇందులో చేనేత కార్మికులకు రూ.96.43 కోట్లు, పవర్‌లూమ్‌ కార్మికులకు రూ.13 కోట్ల చొప్పున మొత్తం 25 వేల మందికి లబ్ధి జరిగిందన్నారు. కష్టకాలంలో ప్రభుత్వం తమను అర్థం చేసుకుందని కార్మికుల నుంచి సందేశాలు అందుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రస్తుత పథకం గడువు ముగియడంతో ఇలాంటి పథకాలను మరోమారు ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.  

పండుగకు ముందే బతుకమ్మ చీరలు
బతుకమ్మ చీరల ఉత్పత్తి దాదాపు పూర్తి కావొచ్చిందని, వాటి పంపిణీపై దృష్టి సారించినట్లు కేటీఆర్‌ వెల్లడించారు. పండుగకు కనీసం వారం రోజుల ముందు నుంచే చీరల పంపిణీ ప్రారంభించి, అక్టోబర్‌ 2వ వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా చీరల పంపిణీ జరిగేలా కలెక్టర్లను ఆదేశిస్తామన్నారు. చేనేత వస్త్రాల వాడకం పట్ల అవగాహన, ఆసక్తి పెరిగిన నేపథ్యంలో టెస్కో వస్త్రాలకు మరింత బ్రాండింగ్‌ కల్పించే ప్రయత్నాలను ప్రారంభించాలని సూచించారు. హైదరాబాద్‌లో అన్ని వైపులా టెస్కో షోరూమ్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కేటీఆర్‌ సూచించారు.

హ్యాండీ క్రాఫ్ట్‌ షోరూమ్‌ సందర్శన.. 
సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కేటీఆర్‌ ముషీరాబాద్‌లోని గోల్కొండ షోరూమ్‌ను సందర్శించారు. షోరూమ్‌లోని చేనేత వస్త్రాలు, నిర్మల్‌ పెయింటింగ్స్, హ్యాండీ క్రాఫ్ట్‌ ఉత్పత్తులను పరిశీలించారు. షోరూమ్‌ కార్యకలాపాలు, ప్రజల స్పందన తదితరాలను తెలుసుకున్నారు. షోరూమ్‌ పరిసరాల్లో ఉన్న కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ను సందర్శించి కళాకారుల యోగ క్షేమాలను మంత్రి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు