Hyderabad: చెరువు కనిపించడం లేదంటూ కేటీఆర్‌కు ట్వీట్‌.. తీరా చూస్తే

5 Dec, 2022 15:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీలోని లోధా అపార్టుమెంట్‌ వద్ద ఆరు నెలల క్రితం వరకు కనిపించిన చెరువు ప్రస్తుతం కనిపించడం లేదంటూ ఫ్యూచర్‌ ఫౌండేషన్స్‌ సొసైటీ ప్రతినిధులు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో చేసిన ఫిర్యాదు కలకలం రేపింది. ఇందుకు స్పందించిన మంత్రి కేటీఆర్‌ చెరువు కనిపించకపోవడం నిజమే కాబట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


వెంటనే సంబంధిత చెరువును సందర్శించి త్వరగా ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలని జిల్లా కలెక్టర్, కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్‌ ఆదేశాలతో ఉరుకులు, పరుగులు పెట్టిన మున్సిపల్‌ అధికారులు అసలు లోధా అపార్టుమెంట్‌ ప్రాంతంలో చెరువు ఎక్కడుందబ్బా అంటూ లేని చెరువు కోసం వెతుకులాడారు. ట్విట్టర్‌లో చెరువు కనిపించడం లేదంటూ పోస్ట్‌ చేసిన ఫోటోలను పరీక్షించి చూస్తే ఆర్‌టీఓ కార్యాలయం సమీపంలో ఉన్న సెల్లార్‌ గుంతలా అనిపించడంతో మూసాపేట సర్కిల్‌ ఉపకమిషనర్‌ రవికుమార్‌ ఇతర అధికారులు అక్కడికి వెళ్లి చూసి అవాక్కయ్యారు.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర గృహ నిర్మాణ మండలి ఆధ్వర్యంలో బహుళ అంతస్థుల భవనం నిర్మించి విక్రయించేందుకు చేపట్టిన నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వి పూడ్చిన సెల్లార్‌ గుంత కావడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే దాదాపు పదేళ్ల క్రితం తవ్విన సెల్లార్‌ గుంతలో వర్షం కారణంగా నీళ్లు నిండిపోయి చెరువులా మారింది. సెల్లార్‌ గుంతలో పలుమార్లు చిన్నారులు పడి మృతి చెందారు. గత సంవత్సరం ముగ్గురు బాలికలు ఆడుకుంటూ వెళ్లి సెల్లార్‌ గుంతలో పడి మృతి చెందారు.

దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులతో మాట్లాడి సెల్లార్‌ గుంతను పూడ్చి వేయించారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వ పరంగా రూ.5లక్షలు, ఎమ్మెల్యే సొంతంగా రూ.3లక్షలు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఎవరో ఎక్కడో అపార్టుమెంట్‌లో ఉంటూ గతంలో ఇక్కడ చెరువు ఉండేదని అక్కడ పక్షులను చూసేందుకు వెళ్లే వారమని ఇప్పుడు అది కనిపించడంలేదని ట్విట్టర్‌లో తప్పుడు ఫిర్యాదు చేయడం అధికారులతో పాటు స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 
చదవండి: హాస్టల్లో ఉంటున్న కూతుర్ని చూసేందుకు వెళ్లి...అంతలోనే

మరిన్ని వార్తలు