అమ్మానాన్నలే స్ఫూర్తి.. 

31 May, 2021 19:32 IST|Sakshi

హైదరాబాద్‌: ఆపద ఎక్కడ ఉన్న వారు ఆ ప్రాంతానికి వెళ్లి వారిని ఆదుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని పేద ప్రజలకు మేమున్నామంటూ భరోసా కల్పించారు. కరోనా ఫస్ట్‌వేవ్‌లో సుమారు ఐదు వేలకు పైగా మందికి నిత్యావసరాలు అందజేసి అందరి మన్ననలు పొందారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఆకలితో అలమటిస్తున్న వారిని గుర్తించి ఆహారాన్ని అందిస్తున్నారు కేకేఎం ట్రస్ట్‌ చైర్మన్‌ కూన  శ్రీనివాస్‌ గౌడ్‌.  ప్రతిరోజు కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో మొత్తం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి ఒక్కో డివిజన్‌లో 100 మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. దీంతో ప్రతి రోజు సుమారు 800 పైగా ఆకలితో అలమటిస్తున్న వారికి అందజేసి తమ ఔదార్యాన్ని చాటుతున్నారు.  

ఆకలి తీర్చడంలో ఆనందం.. 
కూన కృష్ణ మహాలక్ష్మి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో లాక్‌డౌన్‌ నుంచి  భోజన సదుపాయాన్ని ప్రారంభించి ప్రతిరోజు 10 గంటల వరకు అందిస్తున్నారు. లాక్‌డౌన్‌ 30 వరకు ఉండడంతో ప్రభుత్వం మళ్లీ పెంచితే దుండిగల్, నిజాంపేట్, కొంపల్లి ప్రాంతాలకు కూడా విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు కూన శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్న విషయాన్ని తాను స్వయంగా గుర్తించామని, అందుకు ప్రత్యేకంగా 8 బృందాలను ఏర్పాటు చేసి భోజనాలు అందజేస్తున్నామన్నారు. అన్నార్తుల ఆకలి తీర్చడంలో ఆనందంగా ఉంటుంది.  

అమ్మానాన్నలే ఆదర్శం..
తల్లిదండ్రులు లేకుంటే మనం లేము. వారి ఆశయాలకు అనుగుణంగానే పని చేస్తూ ముందుకు సాగుతున్నా. మా అన్న శ్రీశైలంగౌడ్‌ సహకారం ఎంతో ఉంది. ముఖ్యంగా మా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు చేదోడువాదోడుగా ఉంటున్న మా సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఉదయం నుంచే దినచర్య ప్రారంభిస్తూ మధ్యాహ్నం వరకు అన్నార్తుల ఆకలి తీర్చుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో విస్తరించే ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతం పదివేల మందికి పైగా అందజేస్తున్నాం.        
 – కూన శ్రీనివాస్‌ గౌడ్‌ , ట్రస్ట్‌ చైర్మన్‌ 

మరిన్ని వార్తలు